తండ్రి చితిలో దూకిన కూతురు.. ఎక్కడంటే?

కరోనా మహమ్మారి ఇప్పటికే చాలామంది జీవితాలను అస్తవ్యస్థం చేశాయి. ఒకవైపు కరోనా బారిన పడి తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్న ప్రజలు, మరోవైపు తమ ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నారు. అయితే ఓ తండ్రిని కోల్పోయిన కూతురు ఆ బాధను భరించలేక ఏం చేసిందో తెలిస్తే మనందరి మనసును కలిచివేయడం ఖాయం.

రాజస్థాన్‌లోని బార్మెర్‌లోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ శర్గాకు ఇటీవల కరోనా సోకింది. కరోనాతో ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఆయన మృతి చెందాడు. కాగా ఇటీవల ఆయన భార్య కూడా మరణించగా, వారికి ముగ్గురు కుమార్తెలు. తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన 34 ఏళ్ల చిన్నకూతురు చంద్ర శర్గా తన తండ్రి చితిమంటల్లోకి దూకేసింది. ఇంకా పెళ్లి కాకుండా ఉన్న ఆమె, తన తల్లిదండ్రులను కోల్పోవడంతో తీవ్ర ఆందోళనకు గురై ఇలా తండ్రి చితిమంటల్లోకి దూకినట్లు తెలుస్తోంది.

అయితే ఆమెను అక్కడున్నవారు వెంటనే ఆమెను మంటల్లో నుండి బయటకు లాగారు. కాగా ఆమె అప్పటికే 70 శాతం కాలిపోవడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా ఉన్నవారిని కలిచివేసింది.