కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా ..

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. ఇప్పటీకే రేవంత్ రెడ్డి తీరు నచ్చక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ కి , అలాగే తన పదవికి రాజీనామా చేయగా..తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌.. రేవంత్ రెడ్డి తీరు నచ్చక పార్టీ ను వీడుతున్నట్లు స్వయంగా తెలిపి రాజీనామా చేసారు.

రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ‘‘సోనియా తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో.. రాహుల్‌గాంధీ 2013లో జరిగిన జైపూర్‌ చింతన్‌ శిబిర్‌లో రాహుల్‌ ప్రసంగం విని ఉత్తేజితుడై 2014లో కాంగ్రెస్‌ పార్టీలో చేరా. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత.. కాంగ్రెస్‌ పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్‌ నాయకత్వలో అరాచక పరిస్థితులు నన్ను కలచివేశాయి’’ అని మీడియా సమావేశంలో అన్నారు.

రేవంత్‌ నేతృత్వంలో పార్టీలో అరాచకం నడుస్తుందని , కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నాడని.. ఏఐసీసీ నేతలు సైతం రేవంత్‌ అరాచకాలను అడ్డుకోవడం లేదని శ్రవణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, సునీల్ కనుగలు కుమ్మక్కు అయ్యారని , ఈ ముగ్గురు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకునేందుకు.. వ్యక్తిగత ఈమేజ్‌ పెంచుకునేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారంటూ దాసోజు విమర్శించారు. కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారని దాసోజు.. రేవంత్‌ పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కులం, ధనం ప్రధానం అయ్యాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగతొక్కుతున్నారంటూ పేర్కొన్నారు. వ్యాపార, రాజకీయ లబ్ధి కోసమే రేవంత్‌ రెడ్డి ఆరాటపడుతున్నారని దాసోజు విమర్శించారు. కాంగ్రెస్‌ సభ్యత్వానికి… అన్ని రకాల పదవులకు రాజీనామా చేస్తున్నాని..తదుపరి ఏంటి అనేది త్వరలో తెలుపుతానని శ్రవణ్ తెలిపారు. ప్రస్తుతం ఈయన కూడా బిజెపి లో చేరే ఛాన్సులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.