తెలంగాణ లో కాంగ్రెస్ కు మరో షాక్..బిజెపిలోకి టీపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలంతా కమలం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్, దాసోజ్ శ్రవణ్ వంటి కీలక నేతలు పార్టీని వీడి, బిజెపి పార్టీ లో చేరగా…తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. టీపీసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదని, తమ కష్టాన్ని పార్టీ నేతలు గుర్తించడం లేదని పేర్కొంటూ కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాగా, పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ మరో ప్రకటనలో వెల్లడించారు.

ఏది ఏమైనప్పటికి తెలంగాణ లో బిజెపి జెండా ఎగురవేయాలని బిజెపి పార్టీ పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. కాంగ్రెస్ తో పాటు అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలపై కూడా ఫోకస్ చేసింది. పార్టీ ఫై అసంతృప్తి తో ఉన్న నేతలని బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. నిన్న మునుగోడు సభ లో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో మాజీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ కాషాయం కండువా కప్పుకున్నారు. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది కాంగ్రెస్, టిఆర్ఎస్ నుండి బిజెపి లో చేరబోతున్నట్లు బిజెపి నేతలు చెపుతున్నారు.