జగన్ కి పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదంటూ పురందేశ్వరి ఫైర్

మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ..ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ కి పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..ఏపీ లో జగన్ సర్కార్ తీరు ఫై విమర్శలు కురిపించారు.

జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మరిచారని , మధ్య నిషేధమని మహిళలను మోసం చేశారని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, అరాచకాలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జగన్ రివర్స్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదన్నారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై కూడా పురందేశ్వరి ఘాటుగా స్పందించారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం అంటే.. ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని మెడికల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక గొడుగు కిందకు తీసుకురావాలన్న మంచి ఉద్దేశ్యంతోనే ఎన్టీఆర్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. స్వలాభాపేక్ష లేకుండా ఎన్టీఆర్ పాలన సాగిస్తే… ఇప్పటి పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎందుకు మార్చారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ వైపు ఎన్టీఆర్ పై తనకు అపార గౌరవం ఉందంటూనే… ఆయన పేరును తొలగించడం అన్యాయమని ఆమె అన్నారు.