చెక్ రిపబ్లిక్ లో ఆసక్తికర ఘటన

కరోనాతో బాధపడుతూనే ప్రధాని ప్రమాణస్వీకారానికి విచ్చేసిన చెక్ దేశాధినేత

ప్రేగ్: చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమన్ తాజాగా అందరినీ విస్మయానికి గురిచేశారు. కరోనాతో బాధపడుతూనే ప్రధానమంత్రితో ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమానికి వచ్చారు. అయితే, ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఓ ప్రత్యేకమైన గ్లాస్ చాంబర్ లో ఉండి ప్రమాణస్వీకారం చేయించారు.

చెక్ రిపబ్లిక్ దేశంలో గత అక్టోబరులో ఎన్నికలు జరగ్గా పీటర్ ఫియాల నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. దాంతో పీటర్ ఫియాల ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయనతో దేశాధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయించాలి. అయితే దేశాధ్యక్షుడు మిలోస్ జెమన్ ఇటీవలే అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆయనకు కరోనా సోకింది.

ఇంతలో ప్రధాని ప్రమాణస్వీకారం కార్యక్రమం ఏర్పాటైంది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా… ప్రమాణస్వీకార కార్యక్రమానికి వీల్ చెయిర్ లో వచ్చారు. అధ్యక్షుడితో పాటు పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది కూడా వచ్చారు. ఓ గాజు చాంబర్ లో కూర్చుని ప్రధాని పీటర్ ఫియాలతో ప్రమాణం చేయించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/