బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్‌ తుఫాను ప్రభావం .. 35 మంది మృతి

cyclone-sitrang-toll-in-bangladesh-rises-to-35-10000-houses-damaged

ఢాకా : సిత్రాంగ్‌ తుఫాను బంగ్లాదేశ్‌లోని బైరిసాల్‌ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను కారణంగా 35 మంది మృతిచెందారు. సుమారు 10 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు. తుఫాను ధాటికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవండంతో 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు చీకట్లలోనే మగ్గుతున్నారని, 15 ఎకరాల్లో పంట నాశనమయిందని ప్రభుత్వం వెల్లడించింది. వేల సంఖ్యలో ఫిషింగ్‌ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని తెలిపింది. విమాన రాకపోకలు నిలిచిపోయాయని, వరదల వల్ల రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని పేర్కొన్నది.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 6925 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేశామని వెల్లడించింది. కాగా, తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే తుఫాను అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.