తీన్మార్ మల్లన్న కార్యాలయంలో పోలీసుల సోదాలు

తన ప్రతిష్ఠకు భంగం కలిగించాడంటూ తీన్మార్ మల్లన్నపై యువతి ఫిర్యాదు

హైదరాబాద్ : హైదరాబాద్ పీర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న యూట్యూబ్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు గత రాత్రి ఆకస్మికంగా దాడిచేసి సోదాలు నిర్వహించారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన ప్రతిష్ఠకు భంగం కలిగించాడంటూ ఓ యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన స్నేహితుడు చిలక ప్రవీణ్ గత కొంతకాలంగా మల్లన్న అక్రమాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని యువతి ఆ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో నిన్న ఒక్కొక్కరుగా మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న కార్యాలయాన్ని సీజ్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/