ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా చర్యలు:సీఎస్
గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
cs-somesh-kumar-tele-conference
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల అధికారులతో డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని సూచించారు.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని ఆదేశించారు. చెరువులకు గండ్లు పడుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వివరాలను విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వివరాలు అందివ్వాలన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/