పాకాల సరస్సులో ముసలి దాడి

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో జాలరి ఫై ముసలి దాడి చేసిన ఘటన జాలర్లను భయబ్రాంతులకు గురి చేసింది. బుధరావుపేట గ్రామానికి చెందిన షాట్ల చంద్రమౌళి వృత్తిరీత్యా జాలరి. కొత్తగూడ మండల పరిధిలోని గుండం సమీపం నుంచి పాకాల సరస్సులోకి తెప్పపై చేపలవేటకు వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక మొసలి ఆకస్మాత్తుగా దాడి చేయడంతో కాలు, తొడ పైభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడు బిగ్గరగా కేకలు వేయడంతో మొసలి వదిలేసింది.

అదేసమయంలో అతడికి సమీపంలో చెరువులో చేపలవేటకు వచ్చిన మరికొందరు జాలర్లు గమనించి అతడి వద్దకు వెళ్లి ఒడ్డుకు చేర్చారు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో 108 వాహనంలో నర్సంపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లారు. గతంలో కూడా ముసలి ఇలాగే పశువులఫై దాడి చేసినట్లు తెలిపారు.