బిజెపి వ్య‌తిరేక కూట‌మి ఏర్పాట్ల‌ను స్వాగ‌తించిన నారాయ‌ణ‌

జ‌గ‌న్‌ను కూడా బిజెపి వ్య‌తిరేక కూట‌మిలో చేర్చుకోవాలి!… కెసిఆర్‌కు సీపీఐ నారాయ‌ణ స‌ల‌హా

CPI leader Narayana

హైదరాబాద్‌ః జాతీయ రాజ‌కీయాల్లో బిజెపికి వ్య‌తిరేకంగా కూట‌మి క‌డుతున్న టిఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సిఎం కెసిఆర్ చ‌ర్య‌ల‌ను సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ స్వాగ‌తించారు. బిజెపి వ్య‌తిరేక కూట‌మి ఏర్పాటు దిశ‌గా బుధ‌వారం బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కెసిఆర్ బీహార్ సిఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్‌ల‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీని కూడా నారాయ‌ణ స్వాగ‌తించారు. ఈ క్రమంలో, వైఎస్‌ఆర్‌సిపి అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కూడా బిజెపి వ్య‌తిరేక కూట‌మిలో చేర్చుకోవాల‌ని కెసిఆర్‌కు నారాయ‌ణ స‌ల‌హా ఇచ్చారు.

సీపీఐ తెలంగాణ కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట్ రెడ్డితో క‌లిసి గురువారం హైద‌రాబాద్‌లోని మ‌గ్ధూం భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడిన నారాయ‌ణ‌… తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న బిజెపి నేత‌లు వ‌రుస‌బెట్టి సినిమా హీరోల‌ను క‌లుస్తున్న వైనంపై స్పందించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త‌న తెలంగాణ టూర్‌లో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ భేటీపై నారాయ‌ణ‌ స్పందిస్తూ.. గొప్ప రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కుటుంబానికి చెందిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అమిత్ షాను క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. సినిమా తార‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకుంటున్న బిజెపి… వారి ద్వారానే తెలంగాణ‌లో టిఆర్ఎస్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/