జూబ్లీహిల్స్​ మైనర్ బాలిక రేప్​ కేసు గురించి పూర్తి వివరాలు తెలిపిన సీపీ ఆనంద్..

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న జూబ్లీహిల్స్​ మైనర్ బాలిక రేప్​ కేసుకు సంబదించిన పూర్తి వివరాలను సీపీ ఆనంద్ మీడియా కు తెలియజేసారు. మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం లో బాలిక ను ఎలా ట్రాప్ చేసారో..ఎవరెవరి పాత్ర ఉన్నదో..నిందితులకు ఎలాంటి శిక్ష పడుతుందో వంటి విషయాలను సీపీ ఆనంద్ తెలియజేసారు.

జూబ్లీహిల్స్‌ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్‌, ఐదుగురు మైనర్లు‌. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్‌.. స్కూల్‌ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్‌ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్‌ చేశాడు.

నాన్‌ ఆల్కాహాలిక్‌, స్మోకింగ్‌ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్‌ చేయించారు. పార్టీ కోసం ఒక్కొక్కరి దగ్గర రూ.1200 వసూలు చేశారు. 100 మంది విద్యార్థులు ఈ పార్టీలో పాల్గొన్నారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్‌ మళ్లీ పోస్ట్‌ చేశాడు. మిత్రుడి ద్వారా పార్టీ విషయం తెలుసుకొని బాధితురాలు డబ్బును చెల్లించి, మిత్రుడితో కలిసి పార్టీ మే 28న మధ్యాహ్నం ఒంటి గంటలకు పబ్‌కు చేరుకుంది.

‘1.50 గంటల వరకు బాధితురాలు, ఆమె ఫ్రెండ్‌ కలిసి డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మిత్రుడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆమె మరో స్నేహితురాలిని కలిసింది. అప్పటికే నిందితులు ఆమెను గమనిస్తున్నారు. 3.15 గంటలకు వారిలో ఒకరు ఆమెను కలిసి మాటలు కలిపాడు. ఆ తర్వాత మరో నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కలిశాడు. వారిద్దరూ ఆమెతో అక్కడే అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు.

నిందితుల ప్రవర్తన బాగాలేదని భావించి బాధితురాలు, ఆమె మిత్రురాలు సాయంత్రం 5.15 గంటల సమయంలో పబ్ నుంచి బయటకి వచ్చేశారు. మిత్రురాలు వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మాత్రం నిందితుల ట్రాప్‌లో చిక్కుకుంది’ అని సీపీ ఆనంద్ వివరించారు.

‘బాధితురాలిని కారులో ఎక్కించుకున్న నిందితులు రోడ్ నం. 6 నుంచి రోడ్ నం. 14లోని బేకరీకి తీసుకెళ్లారు. బేకరీకి వెళ్లే దారిలో కారులో ఆమెను బలవంతంగా కిస్ చేశారు. ఆ వీడియోలను వాళ్లే తీసుకున్నారు. ఆ తర్వాత 6 గంటల సమయంలో మెర్సిడిస్ నుంచి ఇన్నోవాలోకి మారారు. సాదుద్దీన్ మాలిక్‌ సహా ఆరుగురు నిందితులు, బాధితురాలు ఆ ఇన్నోవాలో ఎక్కారు. వారిలో ఒక మైనర్ మధ్యలోనే దిగి వెళ్లిపోయాడు’ అని సీపీ చెప్పారు.

‘పెద్దమ్మ టెంపుల్ వెనుకాల ఓ నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని ఆపి, మొదట మైనర్ ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు మిగిలిన నలుగురు నిందితులు కారులోనే ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలి మెడపై, ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఇన్నోవా తిరిగి పబ్ వద్దకు వచ్చింది. అక్కడ బాధితురాలిని వదిలేసి నిందితులు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె తండ్రి వచ్చి తీసుకెళ్లారు’ అని సీపీ ఆనంద్ తెలిపారు.

ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్‌ ప్రకారం.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్‌లో కౌన్సెలింగ్‌ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం.

పబ్‌, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్‌ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్‌ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్‌ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్‌ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్‌ చేశాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్‌ స్పష్టం చేశారు.