సోషల్‌ మీడియా దిగ్గజాలపై జో బైడెన్‌ ఆగ్రహం

తప్పుడు సమాచారం ప్రజలను చంపేస్తోంది..అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోషల్‌ మీడియా దిగ్గజాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌, టీకాల గురించి సోషల్ మీడియా తప్పుడు సమాచారం ప్రజలను చంపేస్తోందని బైడెన్ వ్యాఖ్యానించారు. యూఎస్‌ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి వ్యాక్సిన్లపై ఫేస్‌బుక్‌లో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం ప్రజారోగ్యానికి ముప్పుగా ప్రకటించారు. అంతకుముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యాక్సిన్లపై 65 శాతం తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న వారు12 మంది ఉన్నారనీ, మిగతా ప్లాట్‌ఫామ్‌లపై వీరిపై నిషేధం ఉన్న వీరంతా ఫేస్‌బుక్‌లో మాత్రం చురుకుగా ఉన్నాని ఆరోపించారు. దీనిపై ఫేస్‌బుక్‌ తన విధానాన్ని, చర్యలను మార్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు. టీకాలపై తప్పుడు సమాచారం విస్తృతంగా వ్యాపిస్తోందని, దీన్ని నివారించాలని ఆయా సంస్థలపై వైట్ హౌస్ ఒత్తిడి తెస్తోంది.

అయితే ఈ విమర్శలను ఫేస్‌బుక్‌ తోసిపుచ్చింది. వాస్తవానికి 2 బిలియన్లకు పైగా ప్రజలు కోవిడ్-19 వ్యాక్సిన్లపై అధికారిక సమాచారాన్ని వీక్షించారని ఫేస్‌బుక్‌ ప్రతినిధి డాని లివర్ తెలిపారు. 3.3 మిలియన్లకు పైగా అమెరికన్లు టీకా ఎక్కడ ఎలా పొందాలో తెలుసుకునేందుకు తమ టీకా ఫైండర్ సాధనాన్ని ఉపయోగించారని వివరించారు. వాస్తవాలను చెప్పడం ద్వారా ప్రజల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతున్నామని లివర్ చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/