కరోనా వచ్చినా ఆగని జంట.. ఏం చేశారంటే?

కరోనా కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రాష్ట్రాలకు రాష్ట్రాలే లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాయి. దీంతో ప్రజలు కరోనా అంటే భయపడి చస్తున్నారు. ఈ మహమ్మారి ఎక్కడి నుండి సోకుతుందో అని గజగజా వణికిపోతున్నారు. అయితే ఓ జంట మాత్రం కరోనా సోకినా కూడా ఆగలేకపోయారు. దీంతో వారు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని రాట్లంకు చెందిన ఓ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వరుడికి కరోనా పాజిటివ్ సోకడంతో, ఈ పెళ్లి వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. స్థానిక వైద్యాధికారులు కూడా ఈ పెళ్లిని వాయిదా వేయాలని ఈ జంటను కోరారు. అయితే ఏదేమైనా తమ పెళ్లి అనుకున్న సమయానికే జరగాలని ఆ వధువు గట్టిగా అనుకుంది. దీంతో ఆ జంట పీపీఈ కిట్లు ధరించి మరీ పెళ్లాడారు. ఈ పెళ్లిని అడ్డుకోవాలని స్థానిక అధికారులు ప్రయత్నించినా, కుటుంబ సభ్యుల కోరికమేరకు అన్ని జాగ్రత్తల మధ్య ఈ వివాహం జరిగేందుకు వారు అనుమతినిచ్చారు.

మొత్తానికి కరోనా సోకినా కూడా ఈ జంట పెళ్లి చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కరోనా పెళ్లి వేడుకలో వధూవరులతో పాటు పండితుడు, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. వారు కూడా పీపీఈ కిట్లు ధరించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.