తొలి ఫలితాల్లో దూసుకుపోతున్న బిజెపి

BJP
BJP


కర్ణాటక : కర్ణాటకలోని అధికార బిజెపి పార్టీ ఉప ఎన్నికల ఫలితాల్లో మెజార్టీ అభ్యర్థులు ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో తేడావస్తే ప్రభుత్వమే పడిపోయే ప్రమాదం ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ఉపపోరు ఆసక్తి రేకెత్తించింది. పార్టీ ఫిరాయించిన 15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈనెల ఐదో తేదీన రాష్ట్రంలోని గోకాక్‌, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరేకెరూర్‌, హోసకోటే, కె.ఆర్‌.పురం, శివాజీనగర, మహాక్ష్మి లేఅవుట్‌, యశవంతపుర, విజయనగర, కె.ఆర్‌.పేట, హుణసూరు, చిక్కబళ్లాపుర నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌, బిజెపిలు అన్ని స్థానాలకు పోటీ చేయగా జేడీఎస్‌ 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో బిజెపి గెలుపొందక తప్పని పరిస్థితి. ‘అధికార పార్టీకి ఇదేమంత కష్టమైన పనా?’  అని అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న స్థానాలన్నీ విపక్ష పార్టీలు గెలుపొందినవి కావడమే ఆ పార్టీలో టెన్షన్‌కు కారణం. మొత్తమ్మీద ఈరోజు ఉదయం పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ఫలితాల్లో బిజెపి 10 స్థానాల్లోనూ, కాంగ్రెస్‌ రెండింట, ఒకచోట జేడీఎస్‌ అభ్యర్థులు మెజార్టీలో ఉన్నట్టు సమాచారం వచ్చింది.