ఇస్రో పిఎస్‌ఎల్‌వి సి54 ఉపగ్రహ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

Countdown begins for launch of PSLV C54 satellite from SHARES in Tirupati

శ్రీహరికోటః భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమయింది. శనివారం (నవంబరు 26)న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన అనుసంధాన ప్రక్రియను రెండు రోజుల క్రితం చేపట్టిన శాస్త్రవేత్తలు తాజాగా రిహార్సల్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా ఈ ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. రేపు సరిగ్గా 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామన్నారు.

కాగా, డిసెంబర్ నెలలో అగ్నికుల్ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. అలాగే 2023 ఫిబ్రవరి నెలలో జీఎస్ఎల్వీ – మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నామన్నారు. కాగా కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యాక రాకెట్‌ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. అలాగే ఈ ఏడాది ఇస్రో చేపట్టననున్న ఆఖరి ప్రయోగం ఇదే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/