అవినీతికి తొలిమెట్టు స్వార్థం

పనిపట్ల బాధ్యత, నిబద్ధత లేకపోవటం, క్రమశిక్షణా రాహిత్యం శాపాలుగా..

corruption
corruption


భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు గడిచినా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలు వబడుతుందే తప్పా! అభివృద్ధి చెందిన దేశంగా మాత్రం పేరుకెక్కడం లేదు. ఎంతో అద్భుతమైన జీవవైవిధ్యం, ఎన్నో రకాల సహజవనరులకు నిలయం అయిన భారతదేశం వెనుక బాటుతనానికి కారణం ఎంటానే విషయాన్ని ప్రతి పౌరుడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం గొప్పదే, దేశ ప్రజలైన మనం గొప్పవాళ్లమే! కానీ మనలో కరుడుగట్టిన స్వార్థమే ప్రమాదకరం. ప్రతి మనిషిలో విషంలా విలయ తాండవం చేస్తున్న స్వార్థం అంచెలంచెలుగా ఎదిగి మనకు తెలియకుండానే జాతీయ సమస్యలకు దారి తీస్తుంది. ప్రస్తుతం దేశాభివృద్ధికి, దేశ సమగ్రతకు ఆటకంగా జాతీయసమస్యలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

అవినీతి, పేదరికం, అధిక జనాభా, నిరుద్యోగం ఇలా మొదలైన జాతీయసమస్యలు మన ముందు ఉన్నాయి. వీటిలో అతి ప్రధానంగా దేశాన్ని, సమా జాన్ని భ్రష్టుపట్టిస్తున్న సమస్య అవినీతి. స్వార్థంతో కూడిన విష కోరలు కలిగిన అవినీతి అనే త్రాచుపాముకు నేటిసమాజం బలి అవుతోంది.. నేటి సమాజంలో అవినీతి దేశం, రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం ఇలా స్థాయితో సంబంధం లేకుండా చాపకింద నీరులా విపరీతంగా విస్తరిస్తోంది. సమాజంలో ఉన్న మనుషుల మధ్య విలువలు నశించడం, చేసే పనిపట్ల బాధ్యత, నిబద్ధత లేకపోగా క్రమశిక్షణారాహిత్యం కలిగిఉండటం శాపాలుగా మారి అవినీతికి ఆజ్యం పోస్తున్నాయి.

సమాజంలో ప్రతి మనిషికి ఎదుటివారిపట్ల సానుభూతి, దయగుణం లేకపోవడం కూడా అవినీతికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఒక వ్యక్తిలో తన వ్యక్తిగత అవసరాల కోసం, సుఖం, ఉన్నతి కోసం జనించిన స్వార్థం అనునిత్యం విలువల పతనానికి ప్రయత్నిస్తూ వ్యక్తిలోని నిజాయితీని, మానవత్వాన్ని దూరం చేస్తుంది.

అంతులేని ఆశతో వ్యక్తిగత సుఖాలకు బానిసై సమాజం పట్ల కానీ, తమ పరిసరాల పట్ల కానీ క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన లేకపోవడం కూడా అవినీతి వ్యాప్తికి కారణంగా భావించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ సంపదనే ధ్యేయంగా, ధనార్జనే లక్ష్యంగా తన మాతృదేశం పట్ల ప్రేమ, భక్తియుక్తులను మరిచి పన్నులు కట్టకపోవడం, ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే దొంగ బిల్లులు పెట్టడం, తమ సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి జాతీయ సంపదను సైతం కొల్లగొట్టడం కూడా అవినీతి ఎదుగుదలకు ఒక సూచకంగా చెప్పవచ్చు.

అవినీతికి తొలిమెట్టు స్వార్థం. ఎవరికివారు తమ కోసం, తమ వాళ్ల కోసం, తర్వాతి తరాల కోసం తప్పుడు మార్గాలను అన్వేషిస్తూ అవినీతిని ప్రతి ఒక్కరికి అలవాటుగా మార్చేశారు.

అవినీతి వల్ల పాలనలో పారదర్శకత లోపించి, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనం దూరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఉంటూ పాలనపరమైన పద్ధతులను సక్రమంగా పాటిస్తూ విలువలతో కూడిన అవినీతిరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి.

  • జానపాటి శ్రీనివాస్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/