కార్పొరేట్ కళాశాలలు: నిబంధనలకు పాతర

హైకోర్టు చెప్పే వరకు నిద్రపోతున్న ఇంటర్మీడియట్‌ బోర్టు

లక్షల్లో ఫీజులు.. అంతంత మాత్రంగానే సౌకర్యాలు

ఫైర్‌ ఎన్‌ఒసి లేని 68 కార్పొరేట్‌ కాలేజీలు.. ప్రవేశ పరీక్షతో అడ్మిషన్లు

Corporate Colleges Class Room (file)

హైదరాబాద్‌: విద్యా సంస్థలు కొన్ని నిబంధ నలకు పాతరేస్తున్నా ఇంటర్‌ బోర్డు కళ్లు మూసుకుంటోందని సాక్షాత్తు హైకోర్టు అధికారుల పనితీరును తప్పుపట్టింది. నిజంగానే విద్యా వ్యాపారం ఏ స్థాయిలో ఉందో రాష్ట్రంలో ఏ ఒక్క కార్పొరేట్‌ జూని యర్‌ కాలేజీని పరిశీలించినా సులువుగా వెల్లడవుతుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను వెతికిపట్టుకొని తమతమ కాలేజీల్లో చేర్పించుకోవడం నుంచి వారి వద్ద నుంచి వసూలు చేసే ఫీజులు, హాస్టల్‌ వసతికి భారీగా వసూలు చేసుకుంటూ ఆయా ప్రయివేట్‌ కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా సొమ్ముచేసుకుంటు న్నాయి. కార్పొరేట్‌ కాలేజీల ప్రచారార్భాటంలో ప్రభుత్వ కాలేజీల మనుగడే ప్రశ్నార్థకమవు తున్నది.

పైగా కార్పొరేట్‌ కాలేజీల పట్ల పెరుగుతున్న మోజుతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాటిలోనే తమ పిల్లలను చేర్పిస్తూ అధిక వ్యయభారాన్ని భరిస్తున్నారు. ఒక్కో గ్రూపులో అత్యథిక విద్యార్థులను చేర్చుకుంటూ ఒక్కో బ్యాచ్‌లో మూడు లేదా నాలుగు సెక్షన్ల విద్యార్థుల పట్ల యాజమాన్యం అధిక శ్రద్ధ తీసుకుంటూ ఇతర సెక్షన్ల వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కార్పొరేట్‌ ఈ మాయాజాలం విద్యార్థుల తల్లిదండ్రులకు అవగతం కావడం లేదు.

వేలాది మంది ఆ కాలేజీలో చరదువుకోగా కొన్ని సెక్షన్ల విద్యార్థులకే ర్యాంకులు వస్తుండగా మొత్తం ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారో, అందు లో ఎందరికి ర్యాంకులు వచ్చాయో ఏ కాలేజీ ఎప్పుడూ వివరించిన పాపాన పోలేదు. ఈ విషయాలు వెల్ల డించాలని ఎవరూ డిమాండ్‌ చేయలేరు సరికదా ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రచారంపై ఏ మాత్రం దృష్టిపెట్టడం లేదు. ఈ మేరకు కార్పొరేట్‌ కాలేజీలు నిబంధనలను తుంగలో తొక్కి తమ ఇష్టానుసా రంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతి కాలేజీ కూడా ప్రభుత్వ నిబంధనల ను కచ్చింతంగా పాటించాల్సిన ఉన్నప్పటికీ అధికారులకు అందు తున్న అమ్యామ్మాల వల్ల కార్పొరేట్‌ కాలేజీల వ్యాపారం ఏళ్లతరబడి ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను ఏ ఒక్క ప్రైవేటు కాలేజీ వసూలు చేయడం లేదు. ఇక కార్పొరేట్‌ కాలే జీలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవచ్చు. సర్కార్‌ సీరి యస్‌ అయినా.. కోర్టు హెచ్చరించినా.. బోర్డు అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా కార్పొరేట్‌ కాలేజీలు భయపడటం లేదు. ఉన్నతస్థాయిలో ఉన్న అండదండలతో తాము అనుకున్నదే చేస్తున్నాయి కార్పొ రేట్‌ కాలేజీలు.బోర్డు నిబంధనలను పాటించకుండానే కాలేజీలను నిర్వహి స్తున్నాయి. బోర్డు అనుమతి ఇవ్వకపోయినా ఏ శాఖ నుంచి ఎటువంటి అను మతి లేకుండానే కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు హాస్టల్స్‌ను కొనసాగిస్తు న్నాయి. జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు ఇంటర్‌బోర్డు నియమనిబంధనలను రూపొందించింది. ఆయా నిబంధనలను పాటించకుండానే కాలేజీలను కొన సాగిస్తున్నాయి.

బోర్డులో ఉన్న అధికారులను తమ చెప్పుచేతుల్లోపెట్టుకొని అనుమతులు తెచ్చుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. గత 4 సంవత్సరాలుగా ప్రధానంగా ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండానే కాలేజీలను కొనసాగిస్తున్నాయి. ప్రతి ఏడాది కూడా వచ్చే ఏడాది ఇతర భవనంలోకి మార్చుతామంటూ అఫిడవిట్‌ ఇస్తూ కాలేజీలు బోర్డు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నాయి. అయితే బోర్డులోని కొందరు అధికారులు అవినీతికి అలవాటుపడి కార్పొరేట్‌ కాలేజీలకు తొత్తులుగా మారి వారికి అనుమతులను కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఫైర్‌ ఎన్‌వోసీ విషయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ కావడంతో బోర్డు అధికారులతోపాటు, విద్య శాఖ ఉన్నతాధికారులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అనుమతులు లేకుండా కాలేజీలు ఎలా నడుస్తున్నాయి.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో స్పష్టంగా తెలియజేయాలని హైకోర్టు ఇంటర్‌బోర్డు అధికారులను ఆదేశించింది. దీంతో ఫైర్‌ ఎన్‌వోసీ లేని కాలేజీల లెక్కను బోర్డు అధికారులు తీశారు.

ఫైర్‌ ఎన్‌వోసీల లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ బోర్డు అధికారులకు కూడా తెలియని పరిస్థితి. ఒకసారి 64 కాలేజీలంటారు.. మరోసారి 69 అంటారు.. ఇంకోసారి 79 కాలేజీలంటారు.. వాటిలో కొన్ని ప్రారంభించలే దంటారు.. ఇలా ఫైర్‌ ఎన్‌వోసీ లేని కాలేజీలు ఎన్ని ఉన్నాయో కూడా బోర్డు అధికారుల దగ్గర వివరాలు లేవు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో మొత్తంగా 68 కాలేజీల లిస్టును ఫైర్‌ ఎన్‌వోసీ లేని కాలేజీలుగా గుర్తించారు.

వాటిలో శ్రీచైతన్య కాలేజీలు .. హైదరాబాద్‌లో 6, రంగారెడ్డిలో 8, మేడ్చల్‌ జిల్లాలో 4 ఉన్నాయి. ఇక నారాయణ కాలేజీలు హైదరాబాద్‌లో 12 రంగారెడ్డి లో 3, మేడ్చల్‌ జిల్లాలో 11 ఉన్నాయి. ఇవి కాకుండా శ్రీగాయత్రీ కాలేజీలు 8, ఎన్‌ఆర్‌ఐ కాలేజీలు 5, ఇతర సంస్థల కాలేజీలు 11 ఉన్నాయి. ఇలా మొత్తంగా ఫైర్‌ ఎన్‌వోసీ లేని కాలేజీలు 68గా బోర్డు అధికారులు లెక్క తేల్చారు.

అయితే వాస్తవానికి పైర్‌ ఎన్‌వోసీ లేని కాలేజీలు 100కి పైగా ఉంటాయని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండానే గత 4 సంవత్సరాలుగా ఈ 68 కాలేజీలు కొనసాగుతు న్నాయి. ఒక్కోకాలేజీలో కనీసం 1500 మంది విద్యార్థులుంటారు అనుకుంటే 1.02 లక్షల మంది విద్యార్థులుంటారు. అంటే ఇంటర్‌లో చేరే విద్యార్థుల్లో సగం మంది అనుమతులు లేని కాలేజీల్లోనే చదువుతున్నారు.
కార్పొరేట్‌ కాలేజీలకు సంబంధించిన వసతి గృహాలు అద్వాన్నంగా ఉంటున్నాయి. ఒక గదిలో ఇరుకిరుకుగా ఎనిమిది నుంచి 12 చిన్న మంచాలు ఉంటాయి. బాత్‌ రూంలు విడిగా అందరికీ ఒకేచోట ఉంటాయి.

అయితే జూనియర్‌ కాలేజీలకు అనుబంధంగా హాస్టల్‌ను కొనసాగించడం కోసం రాష్ట్రంలోని ఏ ఒక్క కాలేజీకి కూడా ఇంటర్‌ బోర్డు గానీ ఇతర ఏ శాఖ గానీ అనుమతులు ఇవ్వలేదు. కానీ రాష్ట్రంలో సుమారు 400 నుంచి 500 వరకు రెసిడెన్షియల్‌ కాలేజీలుగా కొనసాగుతున్నాయి. ఇక విద్యార్థులకు ఏర్పాటు చేసే భోజనంలోనూ పౌష్టికాహారం అందించడం లేదు.

రూ. 3 లక్షల వరకు ఫీజులు…

ఇక ఫీజుల విషయానికొస్తే కార్పొరేట్‌ కాలేజీల్లో డే స్కాలర్‌కు ఒక రకంగా.. రెసిడెన్షియల్‌కు ఒక రకంగా ఫీజులను వసూలు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ చేరేందుకు ఎంపీసీ గ్రూపులో చేరే వారికి వివిధ పేర్లతో అడ్మిషన్లను ఇస్తారు. అలాగే మెడిసిన్‌లో చేరేందుకు బైపీసీలో చేరే వారిని కూడా వివిధ పేర్లతో ప్రవేశాలను చేపడతారు. ఏయిమ్స్‌ 60, ఎంపీఎల్‌, ఎన్‌పీఎల్‌, మెడికాన్‌, నియాన్‌, ఎన్‌120, సీఏవో, స్పార్క్‌, సూపర్‌ 60 తదితర పేర్లతో రెసిడెన్షియల్‌గా హాస్టల్స్‌ను కొనసాగిస్తున్నాయి. వీటలో ఫీజులు రూ. 1,00,000 నుంచి మొదలుకొని రూ. 3,00,000 వరకు ఉంటుంది.

ఇక రెసిడెన్షియల్‌ కాకుండా కేవలం డే స్కాలర్‌ అయితే అందులో కూడా వివిధ పేర్లతో అడ్మిషన్లను చేపడతారు. వాటిలో ఫీజులు రూ. 70,000 నుంచి మొదలుకొని రూ. 1.50 లక్షల వరకు ఉంటుంది. అయితే అడ్మిషన్లు కూడా నేరుగా ఇవ్వరు. వారు చేరాలనుకునే కోర్సును బట్టి వారికి ప్రవేశ పరీక్షను నిర్వహించి అడ్మిషన్‌ ఇస్తారు.

ఒకవేళ వారు కోరుకున్న కోర్సులో చేరేలాగా వారికి ప్రవేశ పరీక్షలో మార్కులు రాకపోతే వారిని అందులో కాకుండా మరో కోర్సులో చేరేలా సూచిస్తారు. అడ్మిషన్ల విషయంలో కొత్త విధానంతో కార్పొరేట్‌ కాలేజీలు ముందుకు సాగుతున్నాయి. ముందుగానే ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల వివరాలను సేకరించుకొని విద్యార్థుల అడ్రస్‌ల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లీ ప్రవేశాల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి కార్పొరేట్‌ కాలేజీలు. ఇందుకోసం ప్రత్యేకంగా పీఆర్‌వోల వ్యవస్థను కార్పొరేట్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాయి.

వారి ద్వారా గ్రామాలకు, మండల కేంద్రాలకు పీఆర్‌వోలు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడతారు. డిసెంబర్‌, జనవరి నెలల్లో అడ్మిషన్లు తీసుకుంటే రాయితీ ఎక్కువగా వస్తుందని కాబట్టి ముందుగానే అడ్మిషన్ల తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హామీ పత్రం తీసుకుని ఫీజులో కొంత మొత్తాన్ని ముందుగానే అడ్వాన్స్‌గా తీసుకుని అడ్మిషన్లను నిర్వహిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/