వజ్రాల పరిశ్రమపై కరోనా వైరస్‌ పంజా

రూ.8 వేల కోట్ల నష్టం అంచున సూరత్ వజ్రాల పరిశ్రమ

diamonds
diamonds

సూరత్‌: కరోనా వైరస్‌ చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కాగా చైనాలో ఇప్పటికే 490 మంది ఈ వైరస్ మహమ్మారికి బలయ్యారు. వేల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, కరోనా వైరస్ కారణంగా భారత్ లో వజ్రాల పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి ప్రధానంగా వజ్రాలు దిగుమతి చేసుకునే మార్కెట్లలో హాంకాంగ్ ఒకటి. గుజరాత్ లోని సూరత్ నుంచి ఇక్కడికి ఏటా రూ.50 వేల కోట్ల విలువైన మేలుజాతి వజ్రాలు ఎగుమతి అవుతుంటాయి.

ప్రస్తుతం హాంకాంగ్ లో కరోనా వైరస్ కారణంగా ఎమర్జెన్సీ విధించారు. దాంతో గుజరాత్ వజ్రాల వ్యాపారులు భారత్ కు తిరుగుముఖం పట్టారు. నెలరోజుల పాటు హాంకాంగ్ లో అత్యయిక పరిస్థితి విధించడంతో అక్కడి మార్కెట్ లావాదేవీలు మందగమనంలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సూరత్ వజ్రాల పరిశ్రమకు సుమారుగా రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, హాంకాంగ్ లో జరగాల్సిన అంతర్జాతీయ ఆభరణాల ఎగ్జిబిషన్ రద్దయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/