ఆర్థిక వ్యవస్థపై ‘కరోనా’ పంజా!

కోలుకునేందుకు కనీసం ఏడాది పడుతుందని అంచనా

Coronavirus effect on Economy

ఆర్థిక వ్యవస్థ గడచిన 30ఏళ్లలో ఎన్నడూలేనివిధంగా కుదేలయింది.

కోలుకునేందుకు ప్రభుత్వం ఎంతమేర ఉద్దీపనలు రూపొందించినా ఆర్థికవ్యవస్థ కనిష్టంగా కోలుకునేందుకు కనీసం ఏడాది కాలంపడుతుందని ఆర్థిక వేత్తల అంచనా వేస్తున్నాయి.

ఫిట్చ్‌,మూడీస్‌, ఆసియా అభివృద్ధిబ్యాంకు బార్‌క్లేస్‌, ఇండియా రేటింగ్స్‌ ఇలా ఒకటేమిటి భారత్‌ ఆర్థికరంగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

కరోనా ప్రభావం నుంచి కోలుకునేందుకు కనీసం ఏడాదికాలం పడుతుందని తెగేసి చెపుతున్నాయి.

ఆర్థికవ్యవస్థను ట్రాక్‌లో పెట్టేందుకు నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్‌డిఎ-2 ప్రభుత్వం 1.70 లక్షలతో ప్యాకేజిని సైతం ప్రకటించినా ఉత్పత్తిరంగం మందగించడం వంటి అంశాలతో ఆర్థికవృద్ధి కుంటుపడింది.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతంలో ఎన్నడూలేని విధంగా మందగించాయి.

21రోజుల లాక్‌డౌన్‌ ఫలితంగా భారత్‌లోని అన్ని రంగాలకు కలిపి మొత్తం తొమ్మిది లక్షలకోట్లు నష్టం వాటిల్లుతుందని ముందే అంచనాలు వేసారు.

భారతీయ రిజర్వుబ్యాంకు కూడా కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా కుదేలయిన ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు ఆర్థికవ్యవస్థలోకి మూడులక్షలకోట్ల నగదును చొప్పిస్తామని ప్రకటించింది.

ఇక వేతన జీవులకు మూడునెలల కాలం వేతనాలు నిలిపివేయవద్దని, కోత విధించవద్దని ఆదేశించింది.

రుణబకాయిలు వాయిదాలను మూడునెలల పాటు వాయిదా వేసింది.

అయినా ఎక్కడా ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకాలేదు. సరికదా మరింత క్షీణిస్తోందని ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.

ఇక ఫిచ్‌రేటింగ్స్‌ను పరిశీలిస్తే 5.1శాతం వృద్ధిరేటు ఉంటుందని గతంలో ప్రకటించిన అంచనాలు తగ్గించింది.

రానున్న ఆర్థికసంవత్సరాల్లో మాత్రమే ఏడుశాతం ఉంటుందని అంచనా వేసింది. కొవిడ్‌-19 నుంచి చైనా పరిస్థితి మెరుగుపడినా దేశీయంగా మాత్రం సంక్లిష్టంగా ఉంది.

కరోనాధాటికి చైనా లాక్‌డౌన్‌ చేయడంతో ఆరంభంలో ప్రాంతీయంగా సరఫరా తయారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినది.

దీనివల్ల ఆర్థికవ్యవస్థలో వివేచనాత్మక వ్యయం తగ్గింది. వ్యయం తగ్గడంతో ఎంఎస్‌ఎంఇ సంస్థలతోపాటు సేవలరంగం కూడా క్షీణించిందనే చెప్పాలి.

నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలవద్ద వ్యాపార అవసరాలకు తీసుకునే రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. నగదు లభ్యత సహజంగానే చిన్న సంస్థలవద్ద తక్కువగా ఉంటుంది.

కరోనా వైరస్‌ ఉధృతి వల్ల ఉత్పత్తిరంగంలో సెంటిమెంట్‌ భారీగా దెబ్బతిన్నది.

గత ఏడాది సంక్షోభం అనంతరం ఎన్‌బిఎఫ్‌సి కొంతమెరుగుపడి రికవరీ అవుతుందని భావిస్తున్న తరుణంలో కరోనా వైరస్‌ మహమ్మారి కోలుకోలేని విధంగా దెబ్బతీసిందనడంలో సందేహంలేదు.

భారత్‌ ఆర్థికస్థితిగతులపై సమగ్ర అవగాహన ఉన్న ఆసియా అభివృద్ధి బ్యాంకుసైతం కరోనా వైరస్‌వ్యాప్తితో భారత్‌ అంచనాలను తగ్గించింది.

భారత్‌ ఆర్థికవృద్ధి 6.2శాతం నుంచి దిగజారి నాలుగుశాతానికి మించబోదని అంచనా వేసింది.

మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌కూడా కేలండర్‌ సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు అంచనాలు 5.3శాతం నుంచి 2.5శాతానికి కుదించింది.

స్టాండర్డ్‌ అండ్‌పూర్‌ అంచనాలు కూడా 3.5శాతానికి క్షీణించాయి. ఇండియా రేటింగ్స్‌ 3.6శాతానికి తగ్గించింది.

ఇదంతా కరోనా వ్యాప్తి ప్రభావమేనని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. లాక్‌డౌన్‌ తర్వాత పారిశ్రామిక రంగం కోలుకునేందుకు మరింత వ్యవధిపడుతుంది.

ఇప్పటికే తయారీ సంస్థలన్నీ మూసివేసారు. తిరిగి వాటిని తెరవాలన్నా మరో త్రైమాసికం పడుతుందని చెప్పవచ్చు.

ఇక భారత స్టాక్‌మార్కెట్లపరంగా చూస్తే ఈ కేలండర్‌ సంవత్సరంలోనే 40 లక్షలకోట్లవరకూ నష్టం వాటిల్లింది. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.

కేవలం మూడు ట్రేడింగ్‌ల్లో 19 లక్షలకోట్లు నష్టం వాటిల్లిందంటే కరోనా ప్రభావం ఆర్థికవ్యవస్థ, ఆర్థికసేవల రంగం, తయారీ, సేవలరంగాలపై ఎలాంటి ప్రభావం చూపించిందో అవగతం అవుతున్నది.

వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రభుత్వంతోపాటు రిజర్వుబ్యాంకుసైతం ముందుకు కదలాల్సిందే.

వివిధ ప్రపంచ దేశాల బ్యాంకులు తగ్గించినట్లుగా వడ్డీరేట్లను భారీగానే తగ్గించినప్పటికీ ఆర్థికవ్యవస్థలోకి అత్యవసర నగదును ప్రవేశపెట్టాలి.

కరెన్సీ నిల్వలను ఇందుకు ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి కట్టడికి విదేశీ కరెన్సీ ఖజానాలోని డాలర్లను విక్రయించి రూపాయిని పటిష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది.

అంతేకాకుండా స్వల్పకాలిక రుణాలు మరింతగా జారీచేయాల్సిన అవసరం ఉంది.

రిటైల్‌రంగంతోపాటు ఉత్పత్తిరంగాన్ని ప్రోత్సహిస్తే ఉపాధినష్టాన్ని సాధ్యమైనంతవరకూ తగ్గించవచ్చు. ఆ దిశగా ఇపుడు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కరోనా ప్రభావంతో ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు ప్రభుత్వం వినియోగరంగాలను పటిష్టం చేయకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందని గుర్తించాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/