మురికివాడల్లోనే 57 శాతం కరోనా.. తాజా అధ్యయనం

అధ్యయనం వివరాలు వెల్లడించిన సీరోలాజికల్ సర్వైలెన్స్

57% of Mumbai slum population has developed antibodies: Study

ముంబయి: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ముంబయిలో 57 శాతం మురికివాడల్లో నివసించే ప్రజలు కరోనా బారినపడినట్లు సీరోలాజికల్ సర్వైలెన్స్ అధ్యయనం పేర్కొంది. నగరంలో నివాసం ఉంటున్న 7 వేల మంది నమూనాలను సేకరించిన అధ్యయన బృందం, వారి రక్తంలోని యాంటీ బాడీలపై పరీక్షలు జరిపి ఈ వాస్తవాన్ని వెలువరించింది. వీరిలో అత్యధికులు తమ శరీరంలోని యాంటీ బాడీల సాయంతో కరోనా లక్షణాలు బయట పడకుండా చేసుకున్నారని, గతంలో పలు రకాల వైరస్ ల బారిన పడివుండటం చాలా మందికి ఇప్పుడు ప్లస్ పాయింట్ గా మారిందని పరిశోధకులు వెల్లడించారు.

గతంలో వైరస్ బారిన పడిన వారిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, అవి ఇప్పుడు కరోనాను ఎదుర్కొంటున్నాయని తమ పరిశోధనలో వెల్లడైనట్టు సీరోలాజికల్ సర్వైలెన్స్ పేర్కొంది. కాగా, ముంబయిలో కరోనా కేసులు లక్ష మార్క్ ను దాటిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది దాదాపు 7 శాతానికి సమానం. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నగరంలో సుమారు1.20 కోట్ల మంది నివాసం ఉంటుండగా, వీరిలో 65 శాతం మంది మురికి వాడల్లోనే ఉంటున్నారు.

ఈ అధ్యయనానికి నీతి ఆయోగ్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయి, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ తమవంతు సహకారాన్ని అందించాయి. మూడు మునిసిపల్ వార్డుల్లో పర్యటించిన ఆరోగ్య కార్యకర్తలు శాంపిల్స్ సేకరించారు. కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు పురుషులతో పోలిస్తే మహిళలలో ఎక్కువగా ఉన్నాయని కూడా అధ్యయనం వెల్లడించింది. ఈ సర్వేను జూలై 12 నుంచి 14 వరకు నిర్వహించినట్లు తెలిపారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/