తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్‌ కలకలం?

పరుగులు పెట్టిన అధికారులు

coronavirus
coronavirus

కొత్తపేట: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) హైదరాబాద్‌లో కలకలం రేపుతుంది. తాజాగా ఇప్పుడు తూర్పుగోదావరి వాసులను కూడా ఈవైరస్‌ భయభ్రాంతులకు గురిచేస్తుంది. జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అనంతరం స్వగ్రామమైన వాడపాలేనికి వెళ్లాడు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు, అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, అతడికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు స్వగ్రామం నుంచి తన అత్తగారి ఊరైన గోదశపాలెం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, బాధితుడికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/