ఫిబ్రవరిలో భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు ..రోజుకు లక్ష కేసులు దాటడం ఖాయం -శాస్త్రవేత్తల హెచ్చరిక

corona-cases-increasing-lanzhou-city-imposes-lockdown

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపెట్టడం లేదు. రకరకాలుగా రూపాలు మార్చుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పటికే మొదటి వేవ్ , రెండో వేవ్ తో విరుచుకపడిన ఈ మహమ్మారి ఇప్పుడు థర్డ్ వేవ్ తో రాబోతున్నట్లు శాస్త్రవేత్తల హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి నాటికీ దేశం లో కరోనా మూడో వేవ్ రాబోతుందని ..దీనికి ఫలితంగా రోజుకు దేశంలో లక్ష నుండి లక్షన్నర కేసులు నమోదు అవుతాయని శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. ఫిబ్రవరిలో మూడో వేవ్ తప్పకపోవచ్చని.. అయితే ఇది సెకండ్ వేవ్ కన్నా తక్కువ తీవ్రతతో ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. అయితే దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ కేసుల్లో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కవగానే ఉంటుందని.. ఈ పరిస్థితిని గమనిస్తున్నామని ఆయన అన్నారు.

మరోపక్క ఎక్స్‌పర్ట్స్ మాత్రం మూడో వేవ్ ముప్పు ఉండదని చెపుతున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం, తొమ్మిది రాష్ట్రాల్లోని 50 జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో థర్డ్‌వేవ్ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో థర్డ్ వేవ్ రావడానికి ఆస్కారం లేదని, అనవసర భయాందోళనలు అవసరం లేదని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఇప్పటివరకు 23 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. సోమవారం మహారాష్ట్రలో కొత్తగా రెండు కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏండ్ల వ్యక్తికి, అతడి స్నేహితుడు అమెరికా నుంచి 36 ఏండ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. ఆ ఇద్దరికి కూడా ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవని, ఇద్దరు కూడా ఫైజర్ టీకా రెండు డోసులు తీసుకున్నారని వైద్యాధికారులు తెలిపారు.

గత 10 రోజులుగా రాజస్తాన్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఒడిశా, మిజోరాంతోపాటు జమ్ముకశ్మీర్‌లో క్రమంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్-19 కేసుల పెరుగుదలకు నియంత్రణ చర్యలు తీసుకోవాలని, కంటోన్మెంట్ జోన్లను విధించి కట్టడి చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ లేఖలు రాసింది.