కరోనా కేసులు.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని గౌరవ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గతేడాది కరోనా ఉధృతంగా ఉన్నప్పటి పరిస్థితినుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాన్ని, మన కనీస ధర్మంగా పాటించడం ద్వారా వ్యక్తిగతంగా, సమాజాన్ని తద్వారా భారతదేశాన్ని మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమని ఆయన సూచించారు.15-18 ఏళ్ల వారికోసం టీకాకరణ ప్రారంభించిన నేపథ్యంలో, వారు సైతం తప్పనిసరిగా నిబంధనల ప్రకారం రిజిస్టరు చేసుకుని వీలైనంత త్వరగా టీకాలు వేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

టీకాల విషయంలో అనుమానాలున్న వారిని చైతన్య పరిచి అందరూ టీకాలు వేసుకునే విషయంలో, పౌరసమాజం, ప్రజాసంఘాలు, వైద్య నిపుణులు, ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే ఈ వైరస్ పై పోరాటంలో దేశం చేస్తున్న ప్రయత్నం మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లగలమన్నారు.అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ఉపరాష్ట్రపతి తమ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంతతి వైద్యులు ప్రపంచం నలుమూలల ఎక్కడకు వెళ్లినా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతున్నారన్నారు. భారతీయ జీవన విధానమైన ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో ప్రపంచానికి సేవలందిస్తున్నారన్నారు. 

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/