నిజస్వరూపాలను బహిర్గతం చేస్తున్న కరోనా

విపత్తుల వేళ ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులను జాతీయం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి

Corona revealing realities
Corona revealing realities

ప్రజలుప్రజలకు ఉచిత పథకాలు అడగడంలేదు.మెరుగైన విద్య, వైద్యం ఉచితంగా అందేలా చూడమంటున్నారు. దగ్గు, జ్వరంవస్తే కార్పొరేట్‌ ఆస్పత్రులవైపు పరుగులు తీసే అవసరాన్ని కల్పించకుండా చూడమంటున్నారు.

రాష్ట్ర ఖజానా దివాలా తీసిందనుకుంటే ఎసిబి పరిధి కిందికి సైతంరాని అవినీతిపరుల సొమ్ములో కనీసం పదిశాతం నిధులను వెచ్చించినా వైద్యం, విద్య సౌలభ్యాలను ప్రతి సామాన్యునికి అందుతుంది.

ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో ఇన్నాళ్లు లబ్ధిపొందిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులను ఈ విపత్తు సమయంలో జాతీయం చేసుకొని సామాన్యుల ప్రాణాలను కాపాడలేమా?

ప్రభుత్వం తలుచుకుంటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సను తీసుకురాలేదా? ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చేవిధంగా, ప్రజాభివృద్ధికి దోహదపడే పనులపై శ్రద్ధవహించేలా ముందుకు సాగాలి.

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని మొత్తాన్ని అల్ల కల్లోలం చేస్తోంది.మానవాళి సంఖ్య ను గణనీయంగా తగ్గించేవిధంగా తయారైంది ఈ మహమ్మారి.

అయితే ఈ కరోనా వైరస్‌తో ప్రపంచానికి ఎంత చేటు జరుగుతుందో అంత మంచి సైతం జరుగుతోందనే చెప్పాలి.

ఎందుకంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యం మూలంగా విశ్వం నాశనానికి దగ్గరలో ఉం దని కరోనాకు పూర్వం ప్రపంచం మొత్తం ఆందోళన చెందింది.

కానీ కరోనా మూలంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ విధించుకో వడంతో గాలి కాలుష్యం గణనీయంగా తగ్గిపోయి, భూమిని అతి నీలలోహిత కిరణాల బారి నుండి కాపాడే ఓజోన్‌పొరకు ఏర్పడిన చిల్లులు సైతం పూడిపోయి సాధారణ స్థితికి ఓజోన్‌ చేరుకుందని పలువురు శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు.

అలాగే కాలుష్యం తో కలుషితమైపోయిన పవిత్ర నదులు స్వచ్ఛంగా మారిపోయాయి. ఎదుటి మనిషి కనిపించకుండా కాలుష్యం కోరల్లో ఇరుక్కు పోయిన ఢిల్లీ నగరం స్పష్టంగా కనిపిస్తూ ప్రకృతి చిగురిస్తోంది.

వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. మొత్తానికి నాశనమైపోయిన ప్రకృతి మళ్లీ జవజీవాలు సంతరించుకొని చిగురిస్తూ ఎన్నోవేల ఏళ్ల వెనుకకు వెళ్లి పూర్వశోభను తిరిగి పొందింది.

అయితే కరోనా లాక్‌డౌన్‌ మూలంగా ప్రపంచ దేశాలు వారివారి ఆర్థికస్థితిని ఎంత మేర నష్టపోయాయో తెలియదుకానీ, లక్షల కోట్లు ఖర్చు చేసినా పూరించలేని ప్రకృతికి జరిగిన అపార నష్టాన్ని మాత్రం కరోనా లాక్‌డౌన్‌ మూలంగా తిరిగి సాధించుకోగలిగామానే చెప్పాలి.

అయితే కరోనా మానవాళికి చేసిన,చేస్తున్న నష్టాలు ఎన్ని ఉన్నప్పటికీదాని మూలంగా దేశంలోని పలు ప్రభుత్వాల పనితీరును సైతం కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో, దేశభక్తి ముసుగుతో వారి వారి లోపాలను కప్పిపుచ్చుకున్నప్పటికీ వాటి నిజస్వరూపాలను నిగ్గు తేల్చేలా చేసింది కరోనా.

ప్రజలు ఎన్ను కున్న ప్రజాసేవకులు, ప్రజాస్వామ్యంలో రాచరిక ధోరణితో ప్రభు త్వాలను నడుపుతున్న తీరును ప్రజల కళ్లకుకట్టేలా చేసింది కరోనా.

అలాగే అసలైన ప్రజాసేవకులను సైతం ప్రజల ఎదుట నిలిపింది కరోనా.ఒక సామాన్యుడు బతకడానికి కావాల్సింది కూడు, గూడు, గుడ్డ, బతకడానికి ఇవే బలహీనతలు.

కానీ అదే సామాన్యుడి భవి తను నిర్ణయించేవి విద్య, వైద్యం. ఇవి ఈ ప్రజాస్వామ్య దేశంలో పౌరుల కనీస హక్కులు.

అయితే మొదటి మూడువసతులైనకూడు, గూడు,గుడ్డలతో కొంతమేర అందిస్తూ ఎప్పటికప్పుడు సామాన్యుని బలహీనతలను ఉపయోగించుకొని అధికారాన్ని చేజిక్కించుకొని, సామాన్యున్ని ఎదగనీయకుండా చేస్తున్నాయి .

ప్రజాస్వామ్యంలోని కొన్నిప్రభుత్వాలు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే సామాన్యులు తమకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను స్వయంగా సంపా దించుకోగలరు.

కానీ వారిని సోమరిపోతులను చేస్తూ, సాదు జంతువ్ఞలా నిత్యం వారికి కావలిసిన కూడు, గూడు, గుడ్డను ఉచితంగా అందిస్తూ జీవిత కాలం వారిని స్వయం ప్రకటిత బాని సలుగా ప్రభుత్వాలు చేస్తున్నాయేమోననిపిస్తున్నది నేటి ప్రభుత్వాల తీరు చూస్తుంటే.

ప్రాణాలను కాపాడగలిగే వైద్యాన్ని, స్వశక్తితో బతకడానికి అవసరమయ్యే విద్యను ప్రతి ప్రభుత్వం తప్పనిసరిగా అందించాలని రాజ్యాంగమే చెబుతున్నా ఎందుకు ప్రభుత్వాలు ఈ రెండు నాణ్యంగా, ఉచితంగా అందించడం లేదు?

దాదాపు 130 కోట్లజనాభా సంఖ్యను దాటేసిన దేశంలో 235 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు వాటిలో 31,275 ఎంబిబిఎస్‌ సీట్లు, అలాగే 800 ఎం బిబిఎస్‌సీట్లు గల తొమ్మిది ఆల్‌ ఇండియన్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) కలిగి ఉండటం.

అలాగే రాష్ట్రంలో 20 మెడికల్‌ కాలేజీలు వాటిలో 2,600 ఎంబిబిఎస్‌సీట్లు కలిగి ఉండటం ఇదీ మెడికల్‌ రంగంలో మన దేశం, మన రాష్ట్ర స్థితి.

అయితే 130 కోట్లపైగా ఉన్న జనాభాతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న అతిపెద్ద దేశమైన భారతదేశానికి ఇవన్నీ అతి తక్కువ సామర్థ్యం మాత్రమే నని గమనించాలి.

అదృష్టవశాత్తు భారతదేశానికి ప్లేగు, సార్స్‌, ఎబోలా లాంటి మహమ్మారిల తాకిడిఅంతగా లేకపోవడం, భారత దేశ ఆహార వ్యవహారాలలో సహజ ఔషధాలు మెండుగా కలిగి ఉండటంతో వైద్యరంగంలో ఉండే లోపాల మెరుగుదల అవశ్యకత దేశ పాలకులకు అంతగా ఏర్పడి ఉండకపోవచ్చు.

దేశంలో భయా నక అంటురోగమో,భయంకర వైరసో వ్యాపించినప్పుడు మాత్రమే కాదు పేద, మధ్యతరగతి మనిషికి కనీస నాణ్యమైన ఉచితవైద్యం అందక దేశంలో ప్రతి రోజూ వేలాది మంది ప్రజలు తనువు చాలి స్తున్నారనేది కాదనలేని వాస్తవం.

సాధారణ జ్వరాలతో మొదలు కొని, షుగర్‌, డెంగ్యూ, కేన్సర్‌, ఎయిడ్స్‌ లాంటి వ్యాధులను ఎదుర్కొనే దమ్ము ఇప్పటికీ మన ప్రభుత్వ ఆస్పత్రులకు, మనదేశ వైద్యరంగానికి లేకపోవడం అనే అంశాలు ఎందుకు మన పాలకుల మస్తిష్కానికి తట్టవో అర్థంకాదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధ నల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్‌ కలిగి ఉండాలి.

కానీ 140 కోట్లకు చేరువలో జనాభా కలిగిన దేశంలో ప్రతి14వేల మందికి ఒక డాక్టర్‌ ఉన్నట్లు దేశ గణాంకాలు చెబుతున్నాయి.

ఒకవేళ గంటల వ్యవధిలో ప్రాణాలు తీసే అతి కిరాతకమైన ఎబోలా లాంటి రోగం భారతదేశంలో వ్యాపించి ఉంటే పరిస్థితి ఏమిటి?

అలాంటి పరిస్థితే వస్తే ప్రస్తుత పేలవమైన వైద్యసదుపా యాలకు దేశం, రాష్ట్రం మొత్తం స్మశానంగా మారే అవకాశాలే ఎక్కువ అనడంలో సందేహమేలేదు.

స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నప్పటికీ దేశంలోని సామాన్యులకు మెరు గైన వైద్యం,మెరుగైన ఉచిత ఉన్నత విద్య ఒక మిధ్యగానే మిగిలి పోవడానికి కారకులెవరు?

ఉద్యోగుల జీతభత్యాల నుండి పారిశ్రా మికవేత్తలు కష్టించి సంపాదించిన సొమ్మునుండి, సామాన్యుల బ్యాంకుల ఖాతాల నుండి, పన్నుల రూపంలో, మద్యం సుంకాల నుండి దండిగా వసూలు చేస్తున్న సొమ్ము ఎక్కడికెళ్తోంది?

విపత్తు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడటానికి చేపట్టాల్సిన అసలైన వైద్య చర్యలను చేపట్టకుండా, చప్పట్లతో, దీపాల వెలుగు లతో,లక్షలకోట్ల ‘ఆత్మనిర్భర్‌ భారత్‌ లాంటి అరుంధతి నక్షత్రాలతో ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించడం తప్ప చేసిందేమీలేదు.

ఆత్మ నిర్భర్‌ భారత్‌లో ప్రకటించిన 20లక్షల కోట్లలో ఎంతశాతంప్రజల ప్రాణాలను కాపాడటానికి వైద్యరంగానికి కేటాయింపులు జరిగా యంటే సమాధానాలు ఎందరు ఇవ్వగలరు?

ప్రభుత్వం కరోనా వచ్చిన తొలినాళ్లలో అనుకోని విపత్తు అయిన కరోనా వ్యాధి చికిత్సకు సామాన్యులైనా, ధనవంతులైనా ఎంతపెద్ద వ్యాపారవేత్త అయినా ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్‌ అవ్వాల్సిందే అని ప్రకటించింది.

అయితే తీరా పార్టీ దాకా మ్యాటర్‌ వచ్చేసరికి కరోనా వైద్యానికి కార్పొరేట్‌ ఆస్పత్రులకు అనుమతులిచ్చేసి ప్రజల ఓట్లతో గెలిచిన పాలకులు వేరు, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు వేరు అని నిరూ పించుకుంది.

రాష్ట్రంలో వైద్యరంగం దుస్థితిగురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కరోనా ఎంతమేర వ్యాప్తి చెందుతుం దనే అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలో ఆస్పత్రుల ను ఏర్పాటు చేయలేకపోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను తగిన రీతిలో చేయకపోవడం అందుకు నిదర్శనంగా చెప్పాలి.

ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కరోనా సోకి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ వారం గడవక ముందే నెగిటివ్‌ రిజల్ట్‌ తెచ్చు కొని,ధనియాలు, దాల్చిన చెక్క అంటూ ప్రజలకు చిట్కాలు బోధిం చడం చూస్తూనే ఉన్నాం.

  • శ్రీనివాస్‌ గుండోజు

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/