కోవిడ్‌ కోరల్లో ప్రపంచ పెట్టుబడి

ప్రపంచ వ్యాప్తంగా ఆందోళప

Global investment in Corona epidemic
Global investment in Corona epidemic

ప్రపంచాన్నంత తీవ్ర గందరగోళానికి గురిచేసిన కరోనా మహమ్మారి ప్రభావం పెట్టుబడి విధానంపై అపరి మితంగా పడింది.

దీని దుష్ప్రభావానికి గురికాని రంగమంటూ లేదు. పెట్టుబడికి సంబంధించిన విధానాలు, సంస్థలు, దేశాలకు ఇవి వర్తిస్తాయి.

ముఖ్యంగా దీనికి కారణమైన పర్యావరణం, దాని ఉపద్రవాలకు గురయ్యే పౌరసమాజం, దానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం/ సంస్థల పనితీరు అనంతంగా ఉంది.

వీటిని దృష్టిలో ఉంచుకొనే 14 సంవత్సరాల క్రితం 2006లో అమెరికా కార్పొరేట్‌ రంగం తమ నిర్ణయాలలో భూగోళానికి ప్రజలకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రకటించింది.

ఇప్పటికీ వాటి ప్రాసంగికతలోని ఏమాత్రం మార్పులేదు.

ఈ బహుళ నిర్దేశిత అంశాలపై ఆచరణాత్మక కేంద్రీకరణ స్థిరమైన పెట్టుబడి రంగానికి దన్నుగా ఉండగలదని బ్రిటిష్‌, యూరోప్‌ వాణిజ్య వర్గాలు గత తొమ్మిది నెలలుగా నిరూపిస్తున్నవి.

వీటి కొనసాగింపుపై పూర్తి విశ్వాసంతో విధానాలు రూపొందిస్తున్నాయి.

తద్వారానే విజయవంతమైన, లాభదాయకమైన, సవాళ్లను ఎదుర్కొనేవిగా భావించి పునర్వ్యవస్థీకరణ ప్రారంభించాయి. నూతన సమీకరణలకు తెరలేపాయి. ఈ తరుణంలో రెండో దశ కొవిడ్‌ ప్రపంచాన్ని భయభ్రాంతుల్ని చేస్తోంది.

వంద సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కరోనా మహమ్మారి లాంటివి ఎదుర్కో వడానికి పెట్టుబడి దేశాలు తమ బాధ్యతల్ని సంబంధాలని పునరాలోచించుకునేలా చేస్తుంది.

అది ప్రభుత్వం పట్ల, మార్కెట్‌ పట్ల సమాజం పట్ల కూడా. వారి ముందున్న సవాళ్లలో అత్యంత కీలకమైనవి, వారికి ఏమి కావాలి? ఏమి కోరుతున్నారు? తాము ఏమి ఇవ్వగలం? ఇవి నిరంతరం వారిని వేధించే ప్రశ్నలు.

సమాజం ఉంటేనే ఏ పెట్టుబడైనా! పెట్టుబడి లక్ష్యం ఎల్లప్పుడూ సమాజశ్రేయస్సుకావాలి. పర్యావరణం సక్రమంగా ఉంటేనే పౌర సమాజం సక్రమంగా ఉంటుంది.

కాబట్టి సమాజంతోపాటు పర్యావరణ పరిరక్షణ కూడా వారి పూర్తి బాధ్యత కావాలి.

సామాజిక, సామూహిక, ప్రస్తుత, రాబోయే తరాల ఆస్తి అయిన పర్యావరణాన్ని కొల్లగొట్టే వారిపైనే దానిని కాపాడవలసిన నైతిక బాధ్యత కూడా ఉంది. ఎల్లప్పుడూ ఉంటుంది.

దీనికోసం కార్బన్‌రహిత దిశగా అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రగతి ఫలాలు అందరికీ అందాలి. ప్రపంచ వ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న అంతరాలు తగ్గాలి.

తగ్గించాలి. ఈ అంశాల ప్రాతిపదికన ప్రతి నిర్ణయం సదాచారనగా తర్జుమా కావాలి. ఆచరణరహిత నిర్ణయాలు నిరర్థకం.పై వాటికి అనుగుణంగా విభిన్న రంగాలలో సమాంతర సమగ్ర మార్పులు విశ్వవ్యాప్తంగా తీసుకురావాలి.

ముఖ్యంగా ఇంధన వినియోగం, వ్యవసాయం, ఆహారం, అడవులు, ఫిషింగ్‌, సముద్ర జల ఉత్పత్తులు, నిర్మాణం, మొబైల్‌ రవాణా కర్బాన్‌ లాంటి కాలుష్యరసాయనాలు విసర్జించే తయారీరంగం వగైరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సర్వశక్తులు కేంద్రీకరించాలి.

సమకాలీన ఆర్థిక పరిణామక్రమంలో ఈ మార్పులను గుర్తించి పాటించగలిగితే అవకాశాలను అందిపుచ్చుకున్నట్లు అవుతుంది.

విపత్తుల కాలంలో ప్రజల అవసరాలను తీర్చగల వాడే నిజమైన పెట్టుబడిదారులుగా పరిగణించబడతారు. ఇప్పటికే కరోనా మహమ్మారి పేరుతో వైద్యపరికరాల తయారీ సంస్థలు వారి బాధ్యతలు నిర్వహించడంలో యధాశక్తి కృషి చేశాయి. చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అవసరాలు తీర్చడానికి నిరంతరం యత్నిస్తూనే ఉన్నాయి. కొనుగోలు, సరఫరా ప్రక్రియలన్నీ నూతన సాంకేతికతతో పునర్‌నిర్మిస్తున్నాయి.

ఒక్కోసారి అదనపు వ్యయాలనీ భరిస్తూ సిబ్బందికి రక్షణ కలిగిస్తున్నాయి. అవసరమైన ఇతర అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి.

ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆయా శాఖలు కూడా నియంత్రణలు సడలించాయి.

అనేక సంస్థల ముఖ్య కార్యనిర్వాహకులు అందరూ తమ సిబ్బంది భద్రత అన్నింటి కన్నా ముఖ్యంగా భావించి వారి రాకపోకలకు ఏర్పాటుతో పాటు వారి ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

అలాగే ఇంటి నుండి పనిచేసే వారి విషయంలోనూ, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లోనూ అన్ని రకాల తోడ్పాటు వారికి అందిస్తున్నారు. ఇవి ఎంత చేసినా ఇంకా చేయవలసింది ఎప్పుడు ఎంతో ఉంటూనే ఉంటుంది.

ఆ వెలితిని పూడ్చడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ భయంకర కరోనా కాటుకు ప్రపంచవ్యాప్తంగా పేదలు ఎక్కువగా బలి అవుతున్నారు.

ఇందుకు అమెరికాలోని ఆఫ్రికాకు చెందిన పేద వర్గాల వారే మృతుల్లో ఎక్కువగా ఉండటం ప్రత్యక్ష నిదర్శనం. దీనికి వారి నివాస ప్రాంతాలు ఎక్కువగా వాయుకాలుష్యంతో నిండి ఉండటం.

అది ఈ వైరస్‌ వ్యాప్తికి, మరణాలకి కారణం. వీటికితోడు అనారోగ్యం వల్ల సంక్రమించే మానసిక వ్యాధులు, భరించలేని ఆర్థికపరమైన ఒత్తిడులు సైతం ఈ మహమ్మారి స్వారీకి అదనపు ఉపకరణాలు అయ్యాయి.

ఈ బడుగువర్గాల వారిని అన్ని విధాల ఆదుకుని కాపాడినప్పుడే పెట్టుబడిదారీ సంస్థల అస్తిత్వానికి సార్థకత. ఎక్కడైనా పేదల జీవన పరిస్థితులు మెరుగుపరిస్తేనే వారి జీవన ప్రమాణాలు పెరిగేది.

అందుకు ప్రభుత్వాలు వాటిని పరోక్షంగా నడిపే సంస్థలు సమస్తం అవసరమైన చర్యలు గైకొనాలి. ప్రాణం ఎవరిదైనా ఒకటేనని మరువరాదు.

దీనిలో భాగంగా వేతనాలు, సిబ్బంది తగ్గింపు లాంటిపై స్థాయి నుండి ప్రారంభంకావాలి. తద్వారా వేలాది సంస్థలు లక్షలాదికోట్లు పొదుపు చేయవచ్చు.

కానీ విరు తరచూ కింద నుండి ప్రారంభిస్తారు. మిగిల్చేది అంతంత మాత్రం అయినా. దీర్ఘకాల ప్రాతిపదికపై పెట్టుబడి కేటాయింపులు జరపాలి.

అవి సేవలతోపాటు ఉత్పత్తికి ప్రాధాన్యత కలిగినవి కావాలి. ఉత్పత్తి లేకుండా కేవలం సేవలు బతికి బట్టకట్టలేవు.

సామాజిక అవసరాలు తీరుస్తూ సంస్థను శక్తివంతం గావించాలి. దీనికి కీలకస్థానాల్లో వారి చూపు రాబోయే మూడు నెలల ఫలితాలపై గాక సంవత్స రాంతానికి ఆపై సంవత్సరాలపైన నిమగ్నం కావాలి.

ఇందులో భాగంగా పెట్టుబడిదారులు, సంస్థల ముఖ్యులు నిర్దిష్ట కార్యా చరణ ఉపక్రమించాలి. వీటిలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ముఖ్యం.

లేకుంటే ఇటీవల ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, ఓరెగాన్‌, వాషింగ్టన్‌ అమెజాన్లలో నలభైఆరు లక్షల ఎకరాలలో రేగినా దావానలంలా ఇతర చోట్ల కూడా పెల్లుబుకవచ్చు.

అంతకంతకూ భూతాపం పెరిగి పెరిగి మరో మహా ఉపద్రవం సంభవించవచ్చు.

పెట్టుబడిదారులు అంతా సమైక్యకృషి సల్పితే తప్ప ప్రపంచ కాలుష్య ఉద్గారాలు సగం తగ్గించలేం అని గుర్తించాలి. పారిస్‌ ఒప్పందం లక్ష్య సాధనకు ఇది తప్ప నిసరి.

ఇందులో భాగంగా వినియోగదారులు, సప్లయిదా రులు, సహచరులు, సంబంధిత అందరినీ కలుపుకుపోవాలి. సైద్ధాంతిక విభేదాలకు అతీతంగా అన్ని దేశాలు కలిసి పని చేయాలి.రాబోయే దశాబ్ది ఎంతో ప్రాముఖ్యం కలది.

ఇప్పుడు వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు చేయవలసినది చేయగలిగింది ఎంతో ఉంది.

అన్ని ఆర్థిక వ్యవస్థలని సమైక్యతతో దీర్ఘకాల సమాజశ్రేయస్సు కోసం పునరుద్ధరించాలి. అది ఆరోగ్యకరమైన సక్రమ దామాషాలో ఫలితాల పంపిణీతో, కార్బన్‌రహిత ఆర్థికం కావాలి.

మరో మారు కరోనా లాంటి మహమ్మారి రాకుండా ఉండాలన్నా, వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవలన్నా ఇవన్నీ తప్పనిసరి.

పర్యావరణ రక్షణ, ఆర్థిక సంక్షోభ నివారణే ప్రకృతి ఉప ద్రవాల నివారణలో కీలకమని గ్రహించి సమైక్యంగా మానవాళి మనుగడను కాపాడాలి.

లేకుంటే గత 14 సంవత్సరాల నాటి నిర్ణయాలు ఇప్పటికీ వర్తిస్తున్నట్లే మరో కొన్నిదశాబ్దాల తర్వాత కూడా వీటి ప్రాసంగికత కొనసాగే ప్రమాదం పొంచి ఉందని గుర్తుంచుకోవాలి.

  • బి.లలితానందప్రసాద్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/