ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

నిన్న ఒక్క‌రోజే 5 ల‌క్ష‌ల 7 వేలకుపైగా కొత్త కేసులు

worldwide corona

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కేసులు ప్రపంచవ్యాప్తంగా మరోసారి పెరుగుతుండ‌టంతో ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. నిన్న ఒక్క‌రోజే 5 ల‌క్ష‌ల 7 వేలకుపైగా కొత్త కేసులు న‌మోద‌వ‌గా, 6500కుపైగా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ సోకిన‌వారి సంఖ్య 4.52 కోట్ల‌కు చేరింది. ఇందులో 3.29 కోట్ల మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 11.85 ల‌క్ష‌ల మంది బాధితులు మృతిచెందారు. అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో అమెరికా, భార‌త్ తొలి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి.

ఐరోపాలో మ‌రోమారు పెద్దఎత్తున క‌రోనా కేసులు రికార్డ‌వుతున్నాయి. యూర‌ప్ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతాయ‌ని డాక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. లండ‌న్‌లో రోజుకు 96 వేల కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఈనేప‌థ్యంలో చాలా దేశాల్లో మ‌రోమారు లాక్‌డౌన్ విధించే ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌లో మ‌రో నెల‌రోజుల‌పాటు కార్య‌క‌లాపాలు నిలిపివేయాల‌ని వ్యాపారులు నిర్ణ‌యించారు. అదేవిధంగా స్పెయిన్‌లో కొన్ని ప్రాంతాల‌కు రాక‌పోకల‌పై స్థానిక ప్ర‌భుత్వాలు నిషేధం విధించాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/