ఇంకా 7 లక్షల ప్రాణాలు పోవచ్చు.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

జెనీవా: ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతమైపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఈ మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపిన యూరప్ దేశాల్లో.. మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో ఇక్కడ కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటి వరకూ యూరప్ దేశాల్లో కరోనా బారిన పడి 15 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి ఈ సంఖ్య 22 లక్షలకు చేరుకునే ప్రమాదముందని, రానున్న రోజుల్లో మరో 7 లక్షల మంది ప్రజలు కరోనాకు బలయ్యే పరిస్థితులు యూరప్‌లో కనిపిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

తాజాగా పలు యూరప్ దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరిగాయి. దీంతో చాలా దేశాల్లో మళ్లీ కఠినమైన కరోనా ఆంక్షలు విధించారు. ఇదే పరిస్థితి కొనసాగితే యూరోపియన్ యూనియన్‌లో ఉన్న 53 దేశాల్లో 49 దేశాలు కరోనాతో ఐసీయూలో చేరే వారి సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ఊహిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిగా జరగకపోవడం, మాస్కు తప్పనిసరి వంటి నిబంధనలు తొలగించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అభిప్రాయపడింది. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం సెప్టెంబరు చివర్లో ప్రపంచవ్యాప్తంగా రోజుకు 2100 మంది కరోనాతో మరణించారు. ఈ సంఖ్య ప్రస్తుతం 4200కు చేరింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దడం కోసం ‘వ్యాక్సిన్ ప్లస్‌’ విధానం అమలు చేయాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. అంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మాస్కులు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తిని 53 శాతం మేరకు తగ్గించవచ్చని, తద్వారా వచ్చే మార్చి నాటికి 1.6 లక్షల మరణాలను అడ్డుకోగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/