ఉస్మానియా హాస్పటల్ లో కరోనా కలకలం ..11 మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతుంది. కాస్త తగ్గుముఖం పట్టిందని అనుకునేలోపే మళ్లీ తన పంజా విసురుతుంది. కరోనా తో పాటు ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండడం తో అన్ని రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వీకెండ్ లాక్ డౌన్ , రాత్రి కర్ఫ్యూ వంటి కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే న్యూ ఇయర్ వేడుకల తర్వాత భారీగా కేసులు పెరుగుతున్నాయి. కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులతో పాటు డాక్టర్స్ సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఉస్మానియా హాస్పటల్ లో 11 మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో డాక్టర్స్ బృందం టెన్షన్ పడుతున్నారు.

ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న 11 మంది హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కోవిడ్ థర్డ్‌ వేవ్‌లో భాగంగా గత రెండు రోజులుగా హౌస్ సర్జన్‌లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారు కరోనా పరీక్షలు చేయించుకోగా 11 మంది హౌస్ సర్జన్‌లకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఉస్మానియా ఆసుపత్రిలో కలకలం రేగుతోంది. ఇక తెలంగాణ లో గడిచిన 24 గంటల్లో 48,583 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,673 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,94,030కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి ధాటికి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 4,042కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజు 330 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,522 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య తెలిపింది.