దేశంలో మళ్లీ పెరుగుతున్నకరోనా కేసులు

coronavirus in telangana
coronavirus

న్యూఢిల్లీః కరోనా వైరస్‌ కేసులు దేశంలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,350కి చేరింది. ఇక గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒక్కరోజే 1,000కి పైగా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి 129 రోజుల తరువాత ఇదే తొలిసారి.

కాగా, కేరళ , మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకరాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్‌ కట్టడికి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ పరీక్షలు, వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై చర్చించేందుకు టాప్ మెడికల్ బాడీ ఈ రోజు సమావేశం కానుంది.