వనపర్తి జిల్లాలో బ్రతుకమ్మ చీరల్లో నాణ్యత లేవని ప్రశ్నించినందుకు..పెన్షన్లు ఆపుతామని బెదిరించిన అధికారులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ నడుస్తున్న సంగతి తెలిసిందే. బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. 18 ఏళ్ళు పైబ‌డి రేష‌న్ కార్డులో పేరు న‌మోదైన వారికి చీర‌ల‌ను పంపిణీ చేస్తున్నారు. అయితే వనపర్తి జిల్లా కొత్త కోట మండలం లోని సంకిరెడ్డి పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాభాస జరిగింది.

ఈ కార్యక్రమానికి కొత్త కోట మండలం ఎంపిపి మౌనిక హాజరయ్యారు. ఆమె చీరలు పంపిణీ చూస్తూ ఉండగా చీరలను తీసుకోవడానికి వచ్చిన మహిళలు ఆ చీరల్లో నాణ్యత లేదని అవి నాసిరకం చీరలని చెప్పి నాణ్యత కలిగిన చీరలను పంపిణి చేయవలసిందిగా ఎంపిపి ని కోరారు. దీంతో అసహనానికి గురైన ఎంపిపి మౌనిక ఇచ్చేది ఇవే చీరలు ఇష్టం ఉంటే ఇవే తీసుకోండి లేకుంటే ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పగా చీరల కోసం వచ్చిన మహిళలు అక్కడినుండి చీరలు ఏమి తీసుకోకుండా వెనుదిరిగారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వేరొక అధికారి చీరలు తీసుకోకుంటే వారికీ వచ్చే పెన్షన్ లను ఆపేయవలసిందిగా హుకుమ్ జారీచేశారు. సభకు విచ్చేసిన మరొక అధికారి ఆరై కూడా చీరలు తీసుకెళ్లమని ఎవరు అడిగిన ఇవ్వొద్దని ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ ఘటనతో మరింత ఆవేశానికి గురైన మహిళలు అక్కడినుండి వెళ్లిపోయారు.