విశాఖ గ్లోబల్ సమ్మిట్‌లో అపశృతి

విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అట్టహాసంగా జరుగుతుంది. ఈ సమ్మిట్ కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, జీఎం రావు, నవీన్ జిందాల్, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ సమ్మిట్ లో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఎంవోయూలు కుదుర్చుకుంది. వీటిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు ఉండడం విశేషం.
ఇదిలా ఉంటె ఈ సమ్మిట్ లో మొదటిరోజు అపశృతి చోటుచేసుకుంది. డెలిగేట్ రిజిస్ట్రేషన్ దగ్గర.. నిర్వాహకులు అందరికీ కిట్లు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు.. ఏకంగా కౌంటర్‌ను పీకేశారు. వెంటనే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. అయినా ఫలితం లేకపోయింది. వాళ్లు వచ్చేసరికే మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ మొత్తాన్ని Delegates పాస్ హోల్డర్లు పీకేశారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. అక్కడ పోలీసులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
పెట్టుబడులు పెట్టేవారి కన్నా ఉచిత రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా కావడం వల్ల 14 నుంచి 16వేల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వారందర్నీ లోపలికి అనుమతిస్తే ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉందట. ఇందులో ఎవరు డెలిగేట్స్, ఎవరు ఉచిత రిజిస్ట్రేషన్‌దారులు అనేది తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఒక్కసారి లోపల ఉన్నవారు బయటికి వస్తే లోపలికి అనుమతించే పరిస్థితి లేకుండా పోయిందట. భోజన విరామం సమయంలో డెలిగేట్స్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఫారిన్ డెలిగేట్స్ మాత్రమే అనుతిస్తామని, సాధారణ డెలిగేట్స్‌ను మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత అనుమతిస్తామని చెప్పడంతో చాలాసేపు వారు వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో భోజనాల దగ్గర తొక్కిసలాట జరిగింది. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా చేతులెత్తిసినట్లు తెలియవచ్చింది.
మొత్తానికి చూస్తే.. కోటాను కోట్లు పెట్టి నిర్వహించిన సమ్మిట్‌లో కిట్‌లు, భోజనాల కోసం కుమ్ములాట జరగడంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయస్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా డేలిగేట్స్ వచ్చిన ఈ సమ్మిట్‌లో ఇలా జరగడంతో.. నిర్వాహణ లోపం అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.