ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో ఫీజుల నియంత్రణ

ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ సిస్టమ్‌ ప్రవేశాలు

Online Admissions

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2020-21) నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ సహా అన్ని యాజమాన్య కళాశాలల్లో ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ సిస్టమ్‌ (ఈ-అడ్మిషన్స్‌) ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్మీడియేట్‌ బోర్డు తెలిపింది. దానికి సంబం ధించిన ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.

ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియ మే, జూన్‌ నెలల్లో ప్రారంభమవ్ఞతుందని, ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో వివరాలను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఆన్‌లైన్‌లోనే ప్రవేశాలు కల్పిస్తూ ఇంటర్మీడియేట్‌ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీల ఆగడాలకు ఎంతవరకు అడ్డుకట్ట వేయగలం అనేది ఇప్పుడు చర్చించాల్సిన విషయం.

ఎందుకంటే కార్పొ రేట్‌, ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీలు ఇప్పటికేచాలా మేరకే అడ్వాన్స్‌ ఫీజులను కట్టించుకుని అడ్మిషన్స్‌ కానిస్తున్నాయి. ఇప్పటికే పలు విద్యాసంస్థలు గత మూడు నెలల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులకు టార్గెట్లు పెట్టి ఇంటర్‌ అడ్మిషన్లు చేసుకున్నాయి.

ఇప్పుడు ఈ-అడ్మిషన్ల ద్వారా ఆయా కాలేజీలలో సీటు రాకపోతే, కాలేజీ అడ్మిషన్‌ కోసం ఇప్పటికే చెల్లించిన అడ్వాన్సు ఫీజులు తల్లిదండ్రులకు తిరిగిరావ్ఞ. కాబట్టి ప్రస్తుతం ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజీలు ఎస్సీ,ఎస్టీ, బిసి మైనార్టీలకు నిర్దేశించిన రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. బోర్డు అనుమతించిన సెక్షన్లకు మించి విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.

ఇకపై ఇంటర్‌బోర్డు స్వయంగా ఈ-అడ్మిషన్ల ప్రక్రియను పర్యవేక్షిం చడం వల్ల ఎస్సీ,ఎస్టీ, బిసి రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు జరిగేందుకు అవకాశం ఉంది. కామన్‌ ఫీజు విధానం అంటూ ఏది అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అందువల్ల ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులపై బోర్డు ప్రత్యేకంగా దృష్టి పెట్టి, కాలేజీల వారీగా నిర్ణయించి, ఫీజులను ఈ-ఆన్‌లైన్‌ అడ్మిషన్లకే అనుసం ధానించి, విద్యార్థులు ఆ మేరకే చెల్లించేలా ఇంటర్‌బోర్డు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలుపుతోంది.

దీనివల్ల ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులు నియంత్రించే అవకాశం కలుగుతుంది. దాదాపు అన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ కాలేజీలు ఇంటర్మీడియేట్‌ బోర్డు నిర్ణయించిన పాఠ్యపుస్తకాలను పట్టించు కోని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇంటర్‌ సిలబస్‌ మొత్తాన్ని మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేసి మిగతా సమయాన్ని నీట్‌, జెఈఈ, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇవ్వడానికే ఎక్కువ సమయం కేటాయించడమేకాకుండా, దానికోసం రూ. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం ఇంటర్‌ బోర్డు రూపొందించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యార్థులకు బోధించాలని వాటిని పక్కనపెడితే ఆయా విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని తెలుపుతోంది.

ఈ విధానంలో అడ్మిషన్లు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోకి మారడం వల్ల పదోతరగతిలో తమకు లభించిన మార్కులను బట్టి విద్యార్థులు తమ ఇంట్లో నుంచే ఇంటర్‌ అడ్మిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే కాలేజీలో సీట్లకు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే మాత్రం పదోతరగతిలో మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. ఆయా కాలేజీలకు ఫీజులను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కనుక దరఖాస్తు చేస్తున్న సమయంలోనే ఆ కాలేజీల ఫీజుల వివరాలు కూడా కంప్యూటరు స్క్రీనుపై కనిపిస్తాయి.

ప్రతి విద్యార్థికి ఐదారు కాలేజీలకు ఆప్షన్‌ పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసే విధానం సమూలంగా ఆగిపోతుందని అనలేం కానీ, గరిష్టంగా అడ్డుకట్టపడే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు కూడా యధాతథంగా అమలు కాబోతున్నాయి. అంటే ప్రైవేట్‌ కాలేజీల్లో కూడా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. అయితే ఈ విధానం పక్కాగా అమలు అయితే కార్పొరేట్‌, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజుల రూపంలో వసూలు చేయడం కుదరదు.

ఈ ఏడాది నుంచే ఈ విధానం అమల్లోకి రావడంతో అడ్మిషన్ల దశ నుంచే సంస్కర ణలు వస్తాయి. అవి కార్యరూపంలోకి వస్తే ఇంటర్మీడియేట్‌ కాలేజీల దోపిడీ చాలా వరకు తగ్గుముఖం పడేందుకు అవకాశం ఉంది.ఈ విధానాలు అన్ని విద్యాసంస్థల్లో అన్నిస్థాయిల్లో అమలు చేసినట్లయితే పిల్లల ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తగ్గించినట్లు అవుతుంది. \

వి.సురేష్‌

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/