వైరస్‌పై నిరంతర పోరాటం

కెరీర్‌ గైడెన్స్‌: పోటీపరీక్షల ప్రత్యేకం

Continuous fight against the virus

కరోనా..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌. ఎప్పుడూ ఏదో ఒక వైరస్‌ లేదా బ్యాక్టీరియాలు ప్రజలపై దాడికి పాల్పడుతూనే ఉన్నాయి.

వాటిని అదుపు చేయడానికి అరికట్టడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. ఒకదాన్ని ఎదుర్కొనేలోపు ఇంకొకటి పుట్టుకొస్తోంది. ఇలా తరచూ దేశాలను గడగడలాడించే వైరస్‌లకే దడపుట్టించే వాళ్లూ ఉన్నారు.

వాటి గుట్టువిప్పి, కట్టడి చేసి జనానికి రక్షణ కల్పిస్తారు. వాళ్లే వైరాలజిస్టులు.అందరి ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి ఉద్యోగాల్లో చేరాలంటే కొన్ని కోర్సులు చేయాలి.

పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు వైరాలజీ విభాగంలో పిజి, పిహెచ్‌డి కోర్సులను అందిస్తున్నాయి.

శత్రుమూకలు దేశంపై దండెత్తకుండా సరిహద్దుల్లో సైన్యం మనల్ని కాపాడుతున్నట్లుగానే వైరస్‌లు మానవ జీవితాలను నాశనం చేయకుండా రక్షించేందుకు వైరాలజిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తుంటారు.

సరిహద్దుల్లో శత్రువురాకను అంతోఇంతో ముందే పసిగట్టి సమర్థంగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. కానీ వైరస్‌తో అలా కుదరదు. ఇది కంటికి కనిపించదు.

ప్రభావాన్ని గుర్తించేలోపే పరిధిని విస్తరించుకుంటుంది. ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తుంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ తక్కువ వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల మందిపై ప్రభావాన్ని చూపుతోంది. వేలమంది మరణానికి కారణమవుతోంది.

గజగజలాడించిన హెచ్‌ఐవీ, పోలియోలకూ వైరస్‌లే కారణం. విస్తృత పరిశోధనలు జరగడంతో కొన్నింటికి వ్యాక్తీసన్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్నింటిని వ్యాప్తి చెందకుండా అడ్డుకున్నారు.

ఇవన్నీ వైరాలజిస్టుల పరిశోధనల ఫలితాలే. మనుషులే కాదు జంతువులు, పక్షులపైనా వైరస్‌ దాడి చేస్తుంది. వాటిని వెటర్నరీ వైరాలజిస్టులు రక్షిస్తారు. ఇలాంటి కీలకమైన ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటే కొన్ని కోర్సులు చేయాలి. దాడిచేసిన వైరస్‌ ఏ రకమైనదో గుర్తించడం ఒక సవాలు. దాని వ్యాప్తిని అడ్డుకోవడం మరో కఠిన పరీక్ష.

వైరస్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో నిర్థారించడం, ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూడటం, వైరస్‌ సోకినవారికి మెరుగైన వైద్యం అందించడానికి కొత్త ఔషధాలు, వ్యాక్సీన్ల విషయంలో సూచనలు చేయడం వైరాలజిస్టుల విధులు.

వీరు ఎక్కువ సమయం మైక్రోబయాలజీ ఏదా వైరాలజీ ప్రయోగశాలల్లో గడుపుతారు. కొన్నిసార్లు భిన్న ప్రయోగశాలల్లో పరిశోధనలు చేయాల్సి ఉంటుంది.

కొత్త రకం వైరస్‌ వ్యాప్తిచెందినప్పుడు దాని జన్యులక్షణాలు తెలుసుకోవడానికి మరింత శ్రమించాలి. వైరాలజిస్టుల సలహాలు వైద్యరంగంలోని ఇతరులకూ చాలా అవసరం.

అందువల్ల వారితో కలిసిపనిచేస్తారు. కొన్నిసార్లు ఆసుపత్రులకు వెళ్లి రోగులను కలుస్తారు. కరోనాలాంటి కొత్తరకం వైరస్‌ వ్యాప్తి చెందినప్పుడు ప్రపంచ ఆరోగ్యసంస్థతోనూ కలిసి పనిచేయాల్సి వస్తుంది.

కావాల్సిన నైపుణ్యాలు: వివిధ రకాల పరీక్షలు చేయడం, వాటి ఫలితాలను విశ్లేసించడం, ఒక నిర్ణయానికి రాగలగడం వంటి నైపుణ్యాలు అభ్యర్థులకు ఉండాలి.

పరీక్షల ద్వారా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు వైద్యులు, ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని మెరుగైని సమాచారాన్ని సేకరించాలి.

ఇందుకోసం మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం. ప్రయోగశాల పరికరాలను పూర్తిస్థాయిలో ఉపయోగించడం (మాలిక్యులర్‌ బయాలజీ స్కిల్స్‌) తెలిసి ఉండాలి.

బిఎస్సీలో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కనీసం ఒకటి లేదా బివిఎస్సీ లేదా ఎంబిబిఎస్‌ కోఉ్సలు చదువుతున్నవారు ఎమ్మెస్సీ వైరాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రో బయాలజీ కోర్సులో అంతర్భాగంగా వైరాలజీ ఉంటుంది. యూజిస్థాయిలో వైరాలజీవి ప్రత్యేక సబ్జెక్టుగా అందించడం లేదు.

ఎమ్మెస్సీ వైరాలజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రో బయాలజీ కోర్సులో అంతర్భాగంగా వైరాలజీ ఉంటుంది. యూజిస్థాయిలో వైరాలజీవి ప్రత్యేక సబ్జెక్టుగా అందించడం లేదు.

అందువల్ల భవిష్యత్తులో వైరాలజిస్టులు కావాలనే ఆశయం ఉన్నవాళ్లు డిగ్రీలో మైక్రోబయాలజీని ఒక సబ్జెక్టుగా తీసుకుంటే మంచిది.

మైక్రోబయాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ సబ్జెక్టుల్లో నచ్చిన కాంబినేషన్‌ ఎంచుకోవచ్చు. ఎన్‌ఐవీలో చదవడానికి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 60శాతం మార్కులు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్నవారికి 55శాతం మార్కులు సరిపోతాయి.

ప్రస్తుతం వైరస్‌ భయాల తో ఉన్న ప్రజలకు ఈ కోర్సులకు డిమాండ్‌ కూడా పెరుగుతున్నది. ప్రజల్లో పరిశుభ్రతపై, వైరస్‌పై అవగాహన కూడా పెరుగుతున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/