ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ మృతి

అమరావతి ఆర్-5 జోన్‌లో బందోబస్తుకు వచ్చిన ప్రకాశం జిల్లా దర్శి కానిస్టేబుల్ పవన్ కుమార్ పాము కాటుతో మృతి చెందారు. ఈ ఘటన ఫై టీడీపీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. విధి నిర్వహణ అనంతరం పవన్ కుమార్ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తుండగా కట్ల పాము కాటు వేసింది. దాంతో పవన్ కుమార్ ఆ పామును పట్టుకుని ఇవతలికి లాగారు. ఆ క్రమంలో పాము చేతిపై కూడా కాటు వేసింది. ఇతర కానిస్టేబుళ్లు ఆ పామును చంపివేసి, పవన్ కుమార్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, అతడిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. పవన్ కుమార్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పవన్‌కుమార్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చి పాము కాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి బాధాకరమని పేర్కొన్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి కూడా కల్పించలేని ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే పవన్ కుమార్ ప్రాణాలు తీసిందని చంద్రబాబు మండిపడ్డారు. తమ దౌర్జన్యాలకు పోలీసులను వాడుకోవడమే కానీ, వారి క్షేమం గురించి ఆలోచించలేని ప్రభుత్వం ఇది అని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్నానని వెల్లడించారు. కానిస్టేబుల్ పవన్ కుమార్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.