రాజకీయ గ్రహణంలో దేవుళ్లు!

వరుసగా హిందూ ఆలయాలపై దాడులు

Consecutive attacks on Hindu temples
Consecutive attacks on Hindu temples

జరుగుతున్న సంఘటనల పట్ల ఎంతో మంది స్వామీజీలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుల మత వర్గ వైషమ్యాలతో విచ్ఛిన్నకర విపరీత ఆలోచన విధానాలు కక్షలు కార్పణ్యాలు, స్వార్ధంతో అతలాకుతలమై అట్టుడికిపోతున్న మానవ హృదయ కుహరాల నుండి తమస్సును తరమికొట్టి మనస్సును నిలిపి, మనిషిని మనిషిగా మనడానికి మార్గోపదేశం చేసే అత్యంత పవిత్రమైన దేవాలయ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా క్షంతవ్యం కాదు.

భారతీయ సంస్కృతికి మారుపేరుగా, భక్తివిశ్వాసాలకు నిల యాలుగా ప్రజాదరణ పొంది ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందిన దేవాలయాలు గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గతంలో ఎన్నోవిదేశీ దాడులను ఎదుర్కొని, మరెన్నో ఆటుపోట్లను తట్టుకున్న దేవుళ్లు ఇప్పుడు స్వజనుల దోపిడీలను, దాడులను నివా రించలేకపోతున్నారు.

ఇటీవలికాలంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు ప్రధానంగా విగ్రహాల ధ్వంసాలపై భక్తుల్లో తీవ్ర ఆవేదనే కాదు ఆందోళన వ్యక్తమవుతున్నది.

గతంలో కొన్ని ముఠాలు ఎన్నో వందలాది సంవత్సరాల చరిత్రకలిగిన అపూర్వశిల్పకళాఖండాలున్న దేవాలయ ప్రాంగణాల్లో విగ్రహాలను పెకిలించుకుపోయారు. గుప్త నిధుల కోసం మరొకపక్క తవ్వకాలుచేశారు.ఈ ముఠాలు అప్పుడ ప్పుడు పోలీసులకు పట్టుబడినా వారిపై అంతంతమాత్రం చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడంతో అవి ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఆ ముఠాల లక్ష్యం వేరు.

ఇక కోట్లాది రూపాయల అత్యంత విలువ కలిగిన దేవ్ఞళ్ల ఆస్తులను దిగమింగిన పెద్దల గురించి చెప్పాల్సిన పనిలేదు. ‘

అన్నీవున్నా అల్లుడినోట్లో శని అన్నట్లు ఎంతో విలువైన ఆస్తిపాస్తులున్నా నిత్యపూజలకు నోచుకోక కనీసం దీపం పెట్టే దిక్కులేక కళావిహీనంగా మిగిలిపోతున్న దేవాలయాలు తెలుగు రాష్ట్రాల్లో వేలసంఖ్యలో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా దేవుళ్లను, దేవుళ్ల ఆస్తులను పరిరక్షించాల్సిన, పర్యవేక్షించాల్సిన దేవాదాయ శాఖ పట్టించుకోకపోవడం దురదృష్టకరం.

దేవాలయాలకు భూములు ఎన్నిఉన్నాయి?ఎన్ని ఎవరి ఆధీనంలో ఉన్నాయి? వాటిపై రావా ల్సిన ఆదాయం ఎంత? ఎంత వస్తున్నది? తదితర వివరాలు దేవాదాయశాఖ వద్ద లేవనే చెప్పొచ్చు.తెప్పిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, తయారు చేస్తున్నామంటూ రోజులు, నెలలేకాదు సంవ త్సరాలు గడిపేస్తున్నారు తప్ప అసలు లెక్కతేలడంలేదు.

ఇక భక్తులు సమర్పించుకున్న కోట్లాది రూపాయల కానుకలు కొన్నిచోట్ల పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. దేవుళ్ల హుండీలకు కన్నాలు పడుతున్నాయి. మొన్న హైదరాబాద్‌లో నడిబొడ్డులో ఉన్న ఆలయం నుంచి హుండీలో ఉన్న సొమ్మును దోచుకుపోయారు.ఇప్పుడు తాజాగా విగ్రహాల ధ్వంసానికి ఒడిగడుతున్నారు.

భక్తుల మనోభావాలపై దెబ్బతీస్తున్నారు. మొన్న విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని శిరస్సును వేరుచేసి గుట్టపై ఉన్న కోనేరులో పడేశారు.అంతకుముందు, ఆ తర్వాత దాడులు వరుస గానే జరుగుతున్నాయి.

ఇన్ని సంఘటనలు వరసగా చోటుచేసుకుం టున్నా,రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నా పోలీసులు ఒక్క కేసును కూడా ఛేదించలేకపోతున్నారు. రామతీర్థం సంఘటనపై ధర్మకర్త,మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు పై రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంది.ధర్మకర్తగా ఆయన బాధ్యత ఉందనే విషయంలో వివాదం లేదు. కానీ అన్నీ సంఘటనల్లో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు.

విజయవాడ కనకదుర్గ రథానికి సంబంధించిన సింహం విగ్రహం మాయమైన విషయం లో ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఉదయిస్తు న్నాయి.. ధర్మకర్తల పదవి అనేది ఎంతో పవిత్రమైన బాధ్యత.

ఇలాంటి ప్రమాదం ఉంటుందని, దేవుణ్ణి, దేవుడి ఆస్తులను కాపాడేందుకు భక్తులు సమర్పించుకునే ప్రతిపైసా సద్వినియోగం చేసేందుకు ఎంతోముందు చూపుతో ఏనాడో మన పెద్దలు ధర్మకర్తల వ్యవస్థను ఏర్పరిచారు.

ఎలాంటి జీతభత్యాలు లేకుండా, లాభాపేక్ష లేకుండా దేవుని సేవలో తరించాలనే ఆశయాలున్న వారిని, భూరి విరాళాలు సమర్పించుకున్న వారిని ధర్మకర్తలుగా నియమించే వారు. వారెంతో నీతిన ియమాలు, నియమనిష్టలు, భక్తివిశ్వాసాలతో సత్ప్రవర్తనతో ప్రజలకు ఎంతో ఆదర్శంగా, అనుసరణీయంగా ఉండేవారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామరాజకీయాలు చోటుచేసుకోవడంతో ఆ ప్రభావం దేవాలయ వ్యవస్థపై కూడా పడింది. ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాస కేంద్రాలుగా రూపాంతరం చెందాయి.

వ్యక్తిగత సుగుణాలు, దైవచింతన వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా తమ అనుయాయులను,పార్టీ కార్యకర్తలను ధర్మకర్తల మండలిలో నింపడమే పనిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి ఆలయవ్యవస్థ భ్రష్ఠుపట్టింది.

ఈ పదవ్ఞలను ఉపయోగిం చుకొని దేవ్ఞళ్ల సొమ్మును స్వాహా చేసినవారు కొందరైతే, మరికొందరు తమ వ్యాపారాలను విస్తరిం చేందుకు ఉపయోగించుకున్నారు.

ధర్మకర్తల మండలి ఏనాటి నుంచో ఉంది.ఈ సందర్భంగా త్రేతాయుగం నాటి ఒక కథ గుర్తొ స్తున్నది. రావణ సంహారం అనంతరం రాముడు ప్రజారంజకంగా పాలిస్తున్న కాలంలో రాజ్యసభకు ఒక శునకం వచ్చి తన కాలును సేనాధిపతి విరగొట్టాడని ఫిర్యాదుచేసిందట.ఆ సంఘటనపై తనకు అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మినబంటైన ఆంజనేయస్వామిని (వన్‌మ్యాన్‌ కమిషన్‌) నిజనిర్ధారణ చేయాల్సిందిగా శ్రీరాముడు ఆదేశించాడట.

ఆంజనేయుడు సంఘటనాస్థలం వద్దకు వెళ్లి మొత్తం సంఘటనపై విచారణ జరిపాడు.ఆపదలో ఉన్నవారిని కాపాడ మన్న రాజాజ్ఞను అమలు చేయడానికి తాను తొందరలో వెళ్తు న్నానని ఆ సమయంలో నడిబజారులో పడుకున్న కుక్కను చూసి పక్కకు జరగమని అభ్యర్థించినా లేవలేదని,రథాన్ని పక్కనుండి తీసుకువెళ్లడంతో ఒక చక్రం కుక్కకాలుపై నుంచి పోయిందని ఇందులో తన తప్పేమీలేదని సేనాధిపతి తన వాదనను విని పించారు.

అయితే అనారోగ్యం కారణంగా తాను లేవలేనిస్థితిలో అక్కడ పడిఉన్నానని, ఆపదలో ఉన్నవారిని కాపాడమని రాజాజ్ఞఇస్తే తనను గాయపరచమని కాదని, ఆయనకు అంత తొందర ఉంటే తనను పక్కకు జరిపి వెళితే బాగుంటుందని శునకం తన ప్రతివాదనను వినిపించింది.

కక్షతో చేయకపోయినా, జరిగింది పొరపాటేనని కుక్కకు వెయ్యి బంగారు నాణాలు ఇవ్వాలని ఆంజనేయస్వామి కమిషన్‌ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో ఏకీభవించని కుక్క సుప్రీంకోర్టు (శ్రీరాముడి కోర్టు)కు అప్పీల్‌ చేసింది. కుక్కవాదనను విన్న శ్రీరాముడు కుక్క బంగారు నాణాలు ఏమి చేసుకుంటుందని, దాని కాలు పూర్తిగా నయమ య్యేవరకు సేనాధిపతి స్వయంగా సేవలు అందించాలని తీర్పు చెప్పారు.

దీనికి కూడా కుక్క సంతృప్తి చెందలేదు. ఇదేమీ తీర్పు. కనీసం మీ వద్ద కూడా నాకు న్యాయం జరగలేదంటూ వాపో యింది.ఇంకేమి శిక్ష వేయమంటావ్‌.. ఉరి వేయమంటావా? అని రాముడు ప్రశ్నించాడు.ఉరి కూడా చిన్న శిక్ష అనడంతో విస్తు పోవడం శ్రీరాముని వంతు అయింది. తనకు తెలిసినంతవరకు తమ కోర్టులోఉరడే అత్యంత పెద్దశిక్ష ఉరే అని, ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటే చెప్పు ధర్మబద్ధమైతే తప్పకుండా వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అయోధ్యశివారులో ఉన్న శివాలయానికి ఈ సేనా ధిపతిని ధర్మకర్తగా వేయండని అభ్యర్థించింది. ఇచ్చిన మాట ప్రకారం శిక్షవేసిన అనంతరం అలాంటి కోరిక ఎందుకు కోరావని కుక్కను రాముడు ప్రశ్నించాడు.

గతజన్మలో తాను అదే తరహా ధర్మకర్తనని ఆ నిర్వహణలో ప్రతిరోజూ సాయంత్రం దీపారాధన చేయాల్సిన బాధ్యత తనకు అప్పగించారని, ప్రమిదలో నూనె పోసేటప్పుడు చేతులకు నూనె అంటేదని,ఆ నూనె గోడలకు పూస్తే మరకలు అవుతాయనే ఉద్దేశంతో తాను తలకు రాసుకునే వాడినని,ఆ పాపపరిహారంగా ఇప్పుడు ఈ జన్మవచ్చిందని కుక్క వివరించింది. అలాగే నా కాలును విరగగొట్టిన సేనాధిపతిని ధర్మ కర్తగా నియమిస్తే ఇంతకంటే పెద్దతప్పు చేస్తాడు.

కుక్కకన్న హీన మైన జన్మ ఎత్తుతాడని, అలా నా కక్ష తీరుతుందని కుక్క రాము డికి వివరించింది.ధర్మకర్త అనే పదవి ఎంత పవిత్రమైనదో, ఎంత ఉన్నతమైనదో బాధ్యతాయుతమైనదో ఈ కథ చెప్పకనే చెబుతు న్నది. చేతికి అంటిన నూనెను తలకు రాసుకున్నందుకే కుక్కజన్మ సంప్రాప్తిస్తే దేవుడి సొమ్ము వేలు,లక్షలు,కోట్లు అక్రమంగా భోం చేసేవారు ఎంతటి హీనజన్మ ఎత్తుతారో ఊహించుకోవచ్చు.

స్థానిక కక్షలతో అధికారంలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టేందుకు విగ్రహాల ధ్వంసం జరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేయలేం. దేవాలయాల ధర్మకర్తలను నియమించేటప్పుడు వ్యక్తిగత చరి త్రను, సేవాధర్మనిరతిని పరిగణనలోకి తీసుకోవాలి. ఆలయాల ఆస్తులను, దేవుళ్లను పరిరక్షించే ఉద్యమంలో భాగస్వాములు అవుతారన్న విశ్వాసం ఉన్నవారిని నియమిస్తే కొంతవరకైనా రక్షణ ఏర్పడుతుంది.

ఆలయవ్యవస్థను కాపాడాల్పిన బాధ్యత పాలకులపైనే కాదు సమాజంపై కూడా ఉంది. పవిత్రమైన హిందూ దేవాలయ వ్యవస్థ లో రానురాను రాజకీయ జోక్యం పెరిగిపోవడంపట్ల గతంలో హిందూధర్మాచార్యుల సభ తీవ్రఆందోళన వ్యక్తంచేసింది.

రామతీర్థం సంఘటనపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి మొన్న మంగళవారం మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన వ్యవస్థ ఏమైందని ప్రశ్నించారు.ఈ నెల 17 నుంచి విగ్రహాలుధ్వంసమైన ఆలయాలకు తానే స్వయంగా వెళ్తున్నట్లు ప్రకటించారు.

ధర్మజాగృతి కలిగిన పెద్దలందరూ కలిసి రావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన గతంలోనూ తిరుమలలో అత్యంత ప్రాచీనమైన,పవిత్రమైన వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేస్తున్నప్పుడు తీవ్రంగా కలతచెందారు. నిద్రలేని రాత్రులెన్నో గడిపారు.

ఆ కూల్చివేతను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఉద్యమా నికి కూడా ఉద్యుక్తుల య్యారు. హితులు, శిష్యుల సలహామేరకు మౌనంగా ఉండిపో యారు. ఇప్పటికీ ఆయనలో ఆ బాధ స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది. జరుగుతున్న సంఘటనల పట్ల ఎంతో మంది స్వామీ జీలు తీవ్రఆవేదన చెందుతున్నారు.

కుల, మత, వర్గ వైషమ్యాలతో విచ్ఛిన్నకర విపరీత ఆలోచన విధానాలు కక్షలు కార్ప ణ్యాలు, స్వార్ధంతో అతలాకుతలమై అట్టుడికిపోతున్న మానవ హృదయ కుహరాలనుండి తమస్సును తరమికొట్టి మనస్సును నిలిపి, మనిషి మనిషిగా మనడానికి మార్గోపదేశం చేసే అత్యంత పవిత్ర మైన దేవాలయ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉప యో గించుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా క్షంతవ్యం కాదు.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/