కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

అవయవాల వైఫల్యంతో మరణించినట్టు కుటుంబ సభ్యుల వెల్లడి

Ahmed Patel

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌(71) కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుర్గావ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అహ్మద్ పటేల్ మృతి విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా ప్రభావంతో అవయవాలు బాగా దెబ్బతిని, మరణానికి దారితీసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు ఈ నెల 15 నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తమ సీనియర్ నేత మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.

అహ్మద్ పటేల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. అహ్మద్ పటేల్ ను రాజకీయ దిగ్గజం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు లోక్ సభకు, ఐదుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 1976లో గుజరాత్ లోని బరూచ్ లో జరిగిన స్థానిక ఎన్నికల ద్వారా ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ లో తన విశిష్టత చాటుకున్నారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పటేల్ పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం నియమితమైన నర్మదా మేనేజ్ మెంట్ అథారిటీ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/