పంజాబ్ సీఎం అభ్యర్థి…టెలీ పోల్ ను ప్రారంభించిన కాంగ్రెస్

సీఎం విషయంలో మూడు ఆప్షన్లు
చన్ని, సిద్ధూ.. ఎవరూ కాదు

చండీగఢ్: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ సైతం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మార్గంలో నడుస్తోంది. పంజాబ్ లో ప్రజాభిప్రాయం ఆధారంగా పార్టీ సీఎం అభ్యర్థిని ఆప్ నిర్ణయించడం తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ సైతం ఇదే కార్యక్రమం చేపట్టింది. సీఎం అభ్యర్థి విషయంలో మీ ఓటు ఎవరికో తెలియజేయాలని కోరుతూ టెలీ పోల్ ను మంగళవారం ప్రారంభించింది. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్ని, నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ వీరిలో ఎవరు మీ ఎంపిక? లేదా ఎవరూ కాదు? అన్న ఆప్షన్లను ప్రజల ముందుంచింది. ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్ట్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ తనకు అందుబాటులో ఉన్న ఓటర్లను ఈ విషయంలో సంప్రదిస్తోంది. ఎస్ఎంఎస్ లు పంపిస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా భగవంత్ మన్ ను పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం తెలిసిందే. తద్వారా సీఎంను నిర్ణయించే అధికారాన్ని నేరుగా ప్రజలకు ఇచ్చినట్టయింది. ఈ కొత్త సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుండడం ఆసక్తిదాయకం. భవిష్యత్తులో ఇది దేశవ్యాప్తం అవుతుందేమో చూడాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/