జంతర్ మంతర్ లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపధ్ ను తక్షణమే రద్దు చేయాలంటూ గత కొద్దీ రోజులుగా ఆర్మీ విద్యార్థులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీయేతర పార్టీ లు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష కు దిగింది. పార్టీ ఎంపీలతో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసిసి ఆఫీసు బేరర్లు , రాహుల్ మొదలగు వారు హాజరుకానున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్పందించారు. ఆ పథకాన్ని దిశానిర్దేశం లేకుండా రూపొందించారని ఆరోపించారు. దీనికి నిరసనగా యువత చేపట్టే కార్యక్రమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని..అయితే శాంతియుతంగా హింసకు తావు లేకుండా నిరసనలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రిలో చేరిన సోనియా క్రమేణా కోలుకుంటున్నారు. ఇంత భారీ స్థాయిలో యువత ఆందోళన వ్యక్తం చేస్తుంటే దీనిని విస్మరించటం సరి కాదన్నారు. మరోపక్క కేంద్రం ఈ పథకం పైన వస్తున్న నిరసనలతో కొనసాగింపు కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే అగ్నివీర్లకు సంబంధించి పలు మినహాయింపులు ఇచ్చింది. ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.