నాయకత్వ లోపమే శాపం!

కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సంక్షోభం

congress party
congress party

జాతీయ స్థాయిలోకానీ, రాష్ట్రాల్లోకానీ కాంగ్రెస్‌ పార్టీలో మంచి యువనాయకత్వం ఉంది.

ఉన్నత విద్యలను అభ్యసించి సమర్థులైన, వివేకం ఉన్న యువనేతలు ఎందరో ఉన్నారు. అలాంటి చురుకైన యువతను ముందుకు తేవాలి.

పడక కుర్చీ నేతలను పక్కకుపెట్టాలి. కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచాలి. కాంగ్రెస్‌పట్ల విశ్వాసం, విధేయత, చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు తగ్గిపోవడం ఏమాత్రం పార్టీకి క్షేమం కాదు.

పార్టీ మనుగడకు జీవం కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలే ఎంతకాలం ఈ కంచి గరుడ సేవ అనే భావనతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు.

ఇప్పటికైనా అధిష్టానం వాస్తవ పరిస్థితులను గ్రహించాలి. ప్రజాభిమానం ఉన్న వారికి కీలకబాధ్యతలు అప్పగించాలి.

ప్రజా ధనమా, ప్రజా విశ్వాసమా అనేది చాలా సున్నితమైనవి. అదే సమయంలో చెంచలమైనవి కూడా. ఒకసారి విశ్వాసం, నమ్మకం సన్నగిల్లితే కాంగ్రెస్‌ను కాపాడటం ఎవరితరం కాదు.

ఈ వాస్తవాన్ని అధిష్టానం ఎంత తొందరగా గ్రహిస్తే.. పార్టీకి అంత మేలు.

కాకా లం ఎవరికీ ఒకేవిధంగా ఉండదు. కాలం కలిసివచ్చినప్పుడు పరిస్థితులు వాటంతటవే ఎలా అనుకూలంగా తోసుకువస్తాయో కలిసిరానప్పుడు ఒక్కొక్కటి వికటిస్తుంటాయి.

కలిసివచ్చినప్పుడు అంతా తమ గొప్పగా అన్నట్లు ఆనందోత్సవాలతో విర్రవీగడం, విజయోత్సవాలు నిర్వహించుకోవడం, కలిసిరానప్పుడు పరనిందలు, నిర్వివేదంతో మునిగితేలడం మానవనైజం.

కానీ ఈ జయాపజయాలకు మూలకారణం మానవ ప్రయత్నమేననేది కాదనలేని వాస్తవం. కాలం కలిసిరానప్పుడు అన్నీ తప్పటడుగులు పడతాయనేది వేదాంతుల వాదన.

ఏదేమైనా కలిసివచ్చిన కాలంలో అవకాశాలు ఉపయోగించుకుని గర్వంతో విర్రవీగకుండా మంచి కార్యక్రమాలతో సేవలు అందించిన పార్టీలకు,పార్టీనేతలకు చిరకాలం ప్రజల హృద యాల్లో చోటు దక్కుతుంది.

అదే గర్వంతో కన్ను, మిన్ను కానక ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా భోంచేసి ఇచ్చిన వాగ్దానాలను మరిచి, లక్ష్మీపుత్రు లైతే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఆ ప్రభావం చూపకపోయినా ఆ తర్వాత వాటి పరిణామాలు, ప్రభావాలు ఆ నేతలపై, ఆ పార్టీపై పడకతప్పవ్ఞ.

ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అందుకు అద్దంపడుతున్నదేమోననిపి స్తున్నది. ఒకనాడు భారతదేశంలో ఎదురులేకుండా వెలిగిన కాంగ్రెసు పార్టీ పరిస్థితి రానురానూ దిగజారిపోతున్నది.

పరాజయమేకాదు.. అవమానకరమైన ఓటములమీద ఓటములను మూటకట్టుకొంటున్నది. అందుకు కారణాలు, కారకులగూర్చి లోతుగా అధ్యయనం చేసి ఆత్మపరిశీలన చేసుకుని ఆ ఓటములకు కారణాలేమిటి? చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని భవిష్యత్‌ విజయానికి ఒక మెట్టుగా ఉప యోగించుకోవడం విజ్ఞుల లక్షణం. ఎందుకో ఏమోకానీ కాంగ్రెస్‌ పార్టీలో అది జరగడం లేదు.సమీక్షలు,సమావేశాలకు కొరత లేదు.

కానీ అవి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి వాటిపై చర్చ జరగడం లేదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంలో హస్తిన పెద్దలు విఫలమవుతున్నారని చెప్పక తప్పదు. అందుకు చుట్టూ ఉన్న భజనపరులనేది విమర్శలను కొట్టివేయలేం.

సొంత రాష్ట్రాల్లో ప్రజలతో తిరస్కరించబడిన వారు, అసలు ప్రజలతో సంబంధాలు లేనివారు, సమస్యలపట్ల అవగాహన అంతంతమాత్రంగా ఉన్నవారు, సలహాదారులుగా ఉండటంవల్లే కాంగ్రెస్‌ పార్టీకి ఈ దురదృష్ట పరిస్థితి దాపురించిం దనే కాంగ్రెస్‌ అభిమానుల వాదనను తోసిపుచ్చలేం.

కాంగ్రెస్‌ కాలంలో కుంభకోణాల మీద కుంభకోణాలు చోటుచేసుకుని వేలాది కోట్ల ప్రజాసొమ్ము లూటీ అయింది. అందులో చాలావరకు రుజువు కాకపోవచ్చు.

చట్టాల్లో ఉన్న లొసుగులు ఉపయోగించుకుని, లేదా రికార్డులు తారుమారుచేసి బయటపడవచ్చు.

కానీ ప్రజా కోర్టు నుంచి తప్పించుకోలేరు. వాస్తవాలు బయటకు రాక తప్పవ్ఞ. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పాత పాపాల మూల్యం చెల్లించు కుంటుందేమోననిపిస్తున్నది.

అయినా కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా కొంత ఓటు బ్యాంకు ఉన్నది. అందుకు నేటి నాయకులు కారణం కాదు. భారత్‌లో కాంగ్రెస్‌ పార్టీ నేటికీ సజీవంగా బతికి ఉన్నదంటే ఆనాడు స్వాతంత్య్రసమరంలో పెద్దలు చేసిన త్యాగం,

ఆ తర్వాత ఇందిరాగాంధీ పేద ప్రజల సంక్షేమంకోసం, అభ్యున్న తికి చేపట్టిన సంస్కరణలు నేటికీ కాంగ్రెస్‌ను కొన్నివర్గాల మనస్సుల్లో స్థానం సంపాదించిపెట్టాయి.

కానీ ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే.. ఆ వర్గాలు కూడా క్రమేపీ దూరమైపోతున్నాయి.

ఓట్ల పరంగా చూసినా ఈ విషయం చాలా స్పష్టంగా కనపడుతున్నది. 2009లో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లల్లో 28.55 శాతంతో దాదాపు 12 కోట్ల ఓట్లు కాంగ్రెస్‌ సంపాదించుకున్నది.

2014 వచ్చేసరికి కేవలం 20శాతానికి పడిపోయింది. 2019 వచ్చేసరికి మరింత పడిపోయింది. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య కూడా క్రమేణీ తగ్గుతున్నది.

ఏ కోణంలో చూసినా పార్టీ పరిస్థితి నిరాశాజనకంగానే కన్పిస్తున్నది. కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహిస్తున్నది.

వీటన్నింటికి ముఖ్యకారణం సమర్థవంతమైన నాయకత్వ లోపమనేది అందరూ అంగీకరిస్తున్న విషయమే.

మొన్న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విస్తృతస్థాయి సమావేశం లో మరొకసారి ఇది రుజువైంది. నూతన అధ్యక్షున్ని ఎంపికచేసే విషయంలో కాంగ్రెస్‌ అంతర్గత సంక్షోభం ముదిరి పాకానపడింది.

కాంగ్రెస్‌ నాయకత్వం క్రియాశీలక నేతకు ఇవ్వాలని కొందరు అభి ప్రాయపడ్డారు.

వయోభారం దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షురాలి బాధ్యత నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోనియా గాంధీ వెల్ల డించడంతో కొత్త అధ్యక్షుని విషయంలో వివాదం బయటకు వచ్చింది.

గాంధీ కుటుంబం చేతుల్లోనే పగ్గాలుండాలని ఒక వర్గం పట్టుబడుతుండగా, మరికొందరు ఎఐసిసి సమూల ప్రక్షాళన కోరుతూ సోనియా గాంధీకి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది.

సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు 23 మందికిపైగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టాల్సిన ఐదు అంశాలను ప్రస్తావిస్తూ ఆ లేఖను సంధించారు.

పార్టీ దయనీయ పరిస్థితిపై కాంగ్రెస్‌కు యువత దూరమవ్ఞతున్నదన్న తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో స్పష్టం చేశారు.

మొత్తం మీద ఈ విషయంలో మళ్లీ కాంగ్రెస్‌ చీలిపోతుం దేమోననే ఊహాగానాలు వెలువడ్డాయి.

మొత్తానికి ఈ హై డ్రామా కు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌పెడుతూ సోనియాగాంధీకే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయాక మండలి (సిడబ్ల్యుసి) ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ చర్చల్లో ఆ లేఖ వెనుక బిజెపి కుట్ర ఉందనే పరనిందనుకూడా మోపారు. ఏదేమైనా తదుపరి అధ్యక్ష ఎన్నిక జరిగేవరకూ ఈ పదవిలో సోనియా గాంధీ కొనసాగాలని కోరింది.

హస్తినలో పరిస్థితి అలా ఉంటే.. తెలుగు రాష్ట్రాలతోసహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. ఎపిలో ఇప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ పరి స్థితి మెరుగుపడే అవకాశాలు కన్పించడంలేదు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో కాంగ్రెస్‌పార్టీ ఉనికే లేదంటే అర్థం చేసుకోవచ్చు. కొమ్ములు తిరిగిన బడా నాయకులనుసైతం ప్రజలు ఎన్నికల్లో ఇంటిదారి పట్టించారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ కంటే కొంత మెరుగనిపించినా.. నాయకత్వలోపం స్పష్టంగా కన్పిస్తున్నది.

తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంచివ్యక్తిగా, సౌమ్యుడిగా పేరున్నా.. విద్యాధికుడైనా, టక్కుట మార, గజకర్ణగోకర్ణ విద్యల్లో ఆరితేరినవారు కాదు. ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది.

రాష్ట్ర పరిస్థితి పట్ల అవగాహన లేనివారు, పార్టీ భవిష్యత్‌ను పట్టించుకోని కొందరు నాయకులు హస్తినచుట్టూ ప్రదిక్షిణలుచేస్తూ అధిష్టాన పెద్దల చెవుల్లో ఇళ్లు కట్టుకుని లేనిపోని మాటలు చెపుతుండటం, ఇందుకు ఆ పెద్దలుకూడా సహకరించడంతో కాంగ్రెస్‌పార్టీకి తెలంగాణలో ఈ పరిస్థితి దాపురించిందనేది కాంగ్రెస్‌వాదుల ఆవేదన.

జాతీయస్థాయిలోకానీ, రాష్ట్రాల్లోకానీ కాంగ్రెస్‌పార్టీలో మంచియువ నాయకత్వం ఉంది. ఉన్నత విద్యలను అభ్యసించిన, సమర్థులైన, ప్రజాభిమానం ఉన్న యువనేతలు ఎందరో ఉన్నారు.

అలాంటి చురుకైన యువతను ముందుకుతేవాలి.

పడక కుర్చీ నాయకులను పక్కకుపెట్టాలి. కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచాలి. కాంగ్రెస్‌పట్ల విశ్వాసం, విధేయత, చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు తగ్గిపోవడం ఏమాత్రం పార్టీకి క్షేమంకాదు.

పార్టీ మనుగడకు జీవం కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలే ఎంతకాలం ఈ కంచి గరుడ సేవ అనే భావనతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం వాస్తవ పరిస్థితులను గ్రహించాలి.

ప్రజాభిమానం ఉన్నవారికి కీలకబాధ్యతలు అప్పగించాలి. ప్రజాభిమానం, విశ్వాసమా అనేవి చాలా సున్నితమైనవి. అదే సమయంలో చెంచలమైనవి కూడా.

ఒకసారి విశ్వాసం, నమ్మకం సన్నగిల్లితే కాంగ్రెస్‌ను కాపాడటం ఎవరితరం కాదు. ఈ వాస్తవాన్ని అధిష్టానం ఎంత తొందరగా గ్రహిస్తే.. పార్టీకి అంత మేలు.

  • దామెర్ల సాయిబాబ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/