భారత్ జోడో యాత్ర కు వస్తున్న రెస్పాన్స్ చూసి బిజెపి భయపడుతుంది

రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కు వస్తున్న రెస్పాన్స్ చూసి బిజెపి భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రస్తుతం ట్విట్టర్ వార్ నడుస్తోంది. బర్‌బెర్రీ బ్రాండ్‌కు చెందిన 41,257 రూపాయల టీ షర్ట్ ధరించిన రాహుల్.. ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. బిజెపి కామెంట్స్ కు కాంగ్రెస్ పార్టీ సైతం అంతే విధంగా కౌంటర్ ఇచ్చింది.

‘ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. మనం బట్టల గురించి చర్చించవలసి వస్తే… ప్రధాని మోడీ ధరించిన సూట్ ధర రూ. 10 లక్షలు, గ్లాసెస్ రూ. 1.5 లక్షల గురించి చర్చించాల్సి ఉంటుంది. మరి వీటి గురించి బీజేపీ చర్చించాలనుకుంటుందా?’’ అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కు అందించి యాత్రను ప్రారంభించారు. రాహుల్‌ వెంట 117 మంది నేతలు పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర సందర్భంగా 150 రోజుల పాటు కంటేనర్‌లో బస చేస్తారు రాహుల్‌. కార్యకర్తల కోసం తాత్కాలిక టెంట్లు ఉంటాయి. రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు పొడవునా కొనసాగనుంది.