అసలు నిజాలను ప్రజలకు తెలియజెప్పాలి

బీజేపీ ఎంపీల‌తో ప్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోంద‌ని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను ఎదుర్కొనే విధానంపై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. సభలో చర్చలు జరగకుండా, సభ నడవకుండా ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు.

ఆ పార్టీకి అసలు సభ నిర్వహణ ఇష్టమే లేనట్టుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికీ కాంగ్రెస్ నేతలు హాజరు కాలేదంటేనే.. వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని గుర్తు చేశారు. ఆ పార్టీ నేతల తీరును జనం, మీడియాలో ఎండగట్టాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని సూచించారు. ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఎంపీలంతా తమతమ ప్రాంతాలకు వెళ్లి అసలు నిజాలను ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు.

పెగాసస్ అంశంపై పార్లమెంట్ ను కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్, ప్రధాని మాట్లాడే సమయంలోనూ కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. ఆ పార్టీకి తోడు మిగతా విపక్షాలూ జతకలిసి పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వట్లేదు. ఇవ్వాళ కూడా రాజ్యసభ, లోక్ సభలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై రాజ్యసభ వెల్ లోకి తృణమూల్ ఎంపీ దూసుకెళ్లారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/