త‌వాంగ్ ఘ‌ర్ష‌ణ‌..మోడీ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శలు

mallikarjun kharge
mallikarjun kharge

న్యూఢిల్లీః అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ వ‌ద్ద భార‌త్‌-చైనా సైనికుల ఘ‌ర్ష‌ణ వ్య‌వ‌హారంలో మోడీ స‌ర్కార్ లక్ష్యంగా విమ‌ర్శ‌ల దాడిని కాంగ్రెస్ తీవ్రత‌రం చేసింది. మోడీ ప్ర‌భుత్వ డ్రాగ‌న్‌పై క‌న్నెర్ర చేయ‌కుండా చైనా గ్లాస్‌లు క‌వ‌ర్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. భార‌త పార్ల‌మెంట్‌లో చైనాకు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు కేంద్రం అనుమ‌తించ‌దా అని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ట్వీట్ చేశారు.

గ‌త‌వారం భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణపై స‌మ‌గ్ర చ‌ర్చ చేప‌ట్టాల‌న్న విప‌క్షాల డిమాండ్‌కు ప్ర‌భుత్వం అనుమ‌తించ‌కుండా అవాంత‌రాలు క‌లిగించిన విష‌యాన్ని ఖ‌ర్గే ప్ర‌స్తావించారు. స‌రిహ‌ద్దు వివాదం నేప‌ధ్యంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై చ‌ర్చ‌కు విప‌క్షాలు ప‌ట్టుప‌ట్ట‌గా స్పీక‌ర్ అనుమ‌తించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ బుధ‌వారం విప‌క్ష స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు. త‌వాంగ్ సెక్టార్‌లో య‌థాత‌థ స్ధితిని మార్చేందుకు ప్ర‌య‌త్నించిన చైనా సైనికుల‌ను భార‌త ద‌లాలు నియంత్రించాయ‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగ‌ళ‌వారం స‌భ‌లో వెల్ల‌డించారు.

ఇరు సేన‌ల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త సైనికుల‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని, ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని సింగ్ పేర్కొన్నారు. చైనా అధికారుల దృష్టికి భార‌త ప్ర‌భుత్వం దౌత్య మార్గాల్లో ఈ అంశాన్ని తీసుకువెళ్లింద‌ని చెప్పారు. స‌రిహ‌ద్దులో చైనా దూకుడును భార‌త్ దీటుగా ఎదుర్కోవ‌డం లేద‌ని, డ్రాగ‌న్ ఆక్ర‌మ‌ణ‌కు దిగుతున్నా భార‌త్ నోరు మెద‌ప‌డం లేద‌ని మోడీ స‌ర్కార్ ల‌క్ష్యంగా కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు విమ‌ర్శలు గుప్పిస్తున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/