విపక్ష హోదా కోల్పోయే దశలో కాంగ్రెస్‌!

congress
congress

హైదరాబాద్‌: పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో మరొక శాసనసభ్యుడు టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపితే సిఎల్పీ విలీనం ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. మొత్తం కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో రెండు వంతులు తమ వైపు వస్తే లెక్క సరిపోతుందని ఎదురు చూస్తున్న టిఆర్‌ఎస్‌కు ఉత్తమ్‌ రాజీనామా కలిసొచ్చింది. ఇప్పటికే 11 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు, టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించగా..రెండొంతులు సరిపోవడానికి టిఆర్‌ఎస్‌ వైపు వెళ్లే ఆ ఒక్క శాసన సభ్యుడు ఎవరన్నది తేలాల్సి ఉంది.
శాసనసభ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచారు. ఆ 19లో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఇదే వ్యూహంతో టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసమ్మతి వర్గం ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఇది జరిగితే కాంగ్రెస్‌ పారీ శాసనసభలో విపక్ష హోదాను కోల్పోతుంది. సభలో మొత్తం బలంలో పదో వంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120 మంది శాసనసభ్యులున్న శాసనసభలో ఇప్పటికే టిఆర్‌ఎస్‌కు 91 మంది సభ్యులుండగా..కాంగ్రెస్‌ నుంచి 12, టిడిపి నుంచి ఒకరు చేరితే ఆ పార్టీ బలం 104కి చేరుతుంది. అప్పడు కాంగ్రెస్‌ శాసనసభ్యుల బలం ఆరుకు పడిపోతుంది. దీంతో వీరికంటే ఎక్కువగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/