గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష

రాష్ట్రంలో పేద ప్రజలకు కరోనా చికిత్స‌ను ఉచితంగా అందించాలి
కరోనా, బ్లాక్ ఫంగస్‌ చికిత్సల‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి..కాంగ్రెస్

హైదరాబాద్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ముఖ్య‌ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు దీక్ష‌లో పాల్గొన్నారు. క‌రోనా వేళ రాష్ట్ర స‌ర్కారు తీరుకి నిర‌స‌న‌గా వారు ఈ దీక్ష‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ ఉచితంగా వేయాల‌ని కోరుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీభవన్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ దీక్షలు జరగనున్నాయి.

దీక్ష ప్రారంభించిన సంద‌ర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా చికిత్స‌ కోసం పేదలు త‌మకున్న కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వ‌స్తోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పేదలకు ప్ర‌భుత్వం ఉచితంగా వైద్యం అందించాల్సిందేన‌ని చెప్పారు. కరోనా, బ్లాక్ ఫంగస్‌ చికిత్సల‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయ‌న డిమాండ్ చేశారు. క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/