కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ : టీఎంసీ తీర్థం పుచ్చుకోబోతున్న ఆజాద్

కాంగ్రెస్ పార్టీ కి మరోదెబ్బ తగలబోతోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఎంసీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ప్రస్తుతం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. పలువురు క్రీడాకారులు, సినీ నటులను టీఎంసీలోకి చేర్చుకుంటూ ఆ పార్టీకి గ్లామర్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టులోని సభ్యుడు అయిన కీర్తి ఆజాద్ టీఎంసీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.

క్రికెట్ నుంచి పొలిటీషియన్‌గా మారిన కీర్తి ఆజాద్ బిహార్ రాష్ట్రంలోని దుర్బంగా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2014, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బహిర్గంగా అవినీతి ఆరోపణలు చేయడంతో 2015లో పార్టీ నుంచి కీర్తి ఆజాద్‌ను సస్పెండ్ చేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అరుణ్‌జైట్లీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని కీర్తి ఆజాద్ దుమ్మెత్తిపోశారు.

కీర్తి జాద్ తండ్రి భగవత్ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. గోవాలో లూయిజిన్హో ఫలేరో, అసోంలో సుస్మితా దేవ్ కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరిన తర్వాత కీర్తి ఆజాద్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం. నేడు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కీర్తి ఆజాద్ టీఎంసీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.