ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేత అరెస్టు

ప్రధాని గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న కాంగ్రెస్

congress-leader-arrested-for-ready-to-kill-modi-remarks

న్యూఢిల్లీః ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి రాజా పటీరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. మోడీని ఉద్దేశించి రాజా మాట్లాడిన వీడియో నిన్న వైరల్ అయింది. మోడీని చంపేందుకు సిద్ధం కావాలంటూ ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. పన్నాలోని పవాయ్ పోలీస్ స్టేషన్ లో నిన్న మధ్యాహ్నం పోలీసు కేసు నమోదయింది. ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశారు.

కాగా, “ఎన్నికలే లేకుండా మోడీ చేస్తారు. ఈ దేశాన్ని మతం, కులం, భాష ఆధారంగా మోడీ ముక్కలు చేస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల జీవితాలు ప్రమాదంలో పడతాయి. మన దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే.. మోడీని చంపేందుకు సిద్ధం కావాలి” అని రాజా అన్నారు.

రాజా చేసిన వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన వ్యాఖ్యలను సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీపై కూడా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్ర అసలు స్వరూపం బయటపడుతోందని చౌహాన్ అన్నారు. మోడీని బహిరంగంగా ఎదుర్కోలేక ఆయనను చంపడం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్వేషాలకు ఇది పరాకాష్ఠ అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

మరోవైపు, రాజా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ప్రధాని గురించి కానీ, ఏ ఇతర వ్యక్తి గురించి కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ అనుమతించదని చెప్పింది. ముఖ్యంగా ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి పదాలను వాడకూడదని వ్యాఖ్యానించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/