పునః ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

ప్రస్తుతం కేరళలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ

congress-bharat-jodo-yatra-resumes-after-a-day-break

తిరువనంతపురంః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఒక రోజు విరామం తర్వాత కేరళలో శనివారం తిరిగి ప్రారంభమైంది. 16 రోజుల పాటు నిర్విరామంగా యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ శుక్రవారం విశ్రాంతి తీసుకున్నారు. 17వ రోజు యాత్రను ఈ ఉదయం 6.30 గంటలకే ప్రారంభించారు. ఆయనతో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే నేటి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కూడా పాల్గొన్నారు. త్రిసూర్‌లోని పెరంబ్రా జంక్షన్ వద్ద మొదలైన ర్యాలీలో రాహుల్ ఉదయం 12 కిలోమీటర్ల మేర నడిచారు. అల్పాహారం కోసం అంబల్లూరు జంక్షన్‌లో ఆగారు. సాయంత్రం 5 గంటలకు తాలూర్ బైపాస్ జంక్షన్ వద్ద యాత్ర తిరిగి ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకు సాగుతుందని కాంగ్రెస్ తెలిపింది.

మరోవైపు భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక రానున్నారు. ఈ నెల 30వ తేదీన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఏదో ఒక రోజు సోనియా గాంధీ.. రాహుల్ తో కలిసి పాదయాత్రలో కలిసి నడుస్తారని రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు. ప్రియాంక గాంధీ కూడా విడిగా ఒక రోజు హాజరవుతారని చెప్పారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కాగా, ఈ నెల 7వ తేదీన మొదలైన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. ఈ యాత్ర 150 రోజుల్లో 3,570 కి.మీ పాటు సాగనుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/