అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు , రాస్తారోకో లు చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అగ్నిపథ్ కు సంబదించిన నోటిఫికేషన్ ను సైతం విడుదల చేసింది. ఈ తరుణంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్ పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బిజెపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.ప్రధాని మోదీ చదువు లేని వ్యక్తి అని, అందుకే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. బీజేపీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నమేమీ కాదని, సైనిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో మోదీకి, బీజేపీకి తెలియదని అన్నారు. ఇతర దేశాలు దాడులు చేస్తే ప్రతిదాడులకు సైన్యాన్ని వినియోగిస్తారని, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు సైనికులు రంగంలోకి దిగుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అయితే, అగ్నిపథ్ కింద నాలుగేళ్ల పాటు ఆయుధాల వాడడంపై శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారిని బయటికి పంపిస్తే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి అంశంలోనూ అయోమయం సృష్టించి తప్పుదోవ పట్టించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు దీక్షలు కొనసాగనున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కూడా దీక్షలు కొనసాగనున్నాయి. మల్కాజిగిరి చౌరస్తాలో జరిగే దీక్ష కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.