జగన్ సొంత జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప లో ఆర్టీసీ ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. నగరపాలక సంస్థకు అద్దె చెల్లించలేదనే కారణంతో అధికారులు కడప పాత బస్టాండ్​ను మూసేశారు. దీంతో బస్సులు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా ఆపేశారు. కార్పొరేషన్‌కు బకాయిలు చెల్లించాలని అనేకమార్లు ప్రత్యుత్తరాలు జరిపినా ఫలితం లేకపోవడంతో బస్టాండ్‌కు తాళాలు వేయవలసి వచ్చిందని కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

బస్టాండ్‌కు తెల్లవారుజామున 4 గంటలకు తాళాలువేయడం వల్ల ప్రయాణికులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2013 నుంచి ఆర్టీసీ అధికారులు .. నగరపాలక సంస్థకు రెండు కోట్లు బకాయిలను చెల్లించలేదని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులకు నోటీసులు ఇచ్చామని, అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఇక చేసేది లేక బస్సులను బస్డా్ండ్ లోకి పంపకుండా ఉదయం బస్టాండును మూసేశామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి, ఆర్టీసీ స్టేట్ చైర్మన్ సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ప్రయాణికులు విస్మయం చెందుతున్నారు. కడప పాత బస్టాండ్​ను నగరపాలక అధికారులు నిర్మించారు. అక్కడ ఆర్టీసీ బస్సులను పార్కింగ్ చేసేందుకు ప్రతినెల ఆర్టీసీ అధికారులు నగరపాలక సంస్థకు అద్దె చెల్లిస్తున్నారు. కాగా ఇప్పుడు గత కొన్నేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.