GHMC లో అన్నపూర్ణ క్యాంటీన్ల రూపు రేఖలే మారిపోయాయి

నిరుపేద‌ల‌కు రూ.5కే భోజ‌నం అందించే అన్న‌పూర్ణ క్యాంటీన్ల రూపు రేఖలు మారిపోయాయి. రోజువారీ కూలీలు, కార్మికులు, హాక‌ర్లు, షెల్ట‌ర్ హోమ్స్‌లో ఆశ్ర‌యం పొందేవారికి అన్న‌పూర్ణ క్యాంటీన్లు ఓ వ‌రంగా ఉంటాయి. నగరంలో వందల సంఖ్యలో ఉన్న ఈ క్యాంటీన్ల రూపు రేఖలు మార్చారు GHMC అధికారులు. మొన్నటి వరకు చిన్న చిన్న షెల్టర్లలో భోజనం అందించే వారు. కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా మార్చేశారు.
కూర్చునే విధంగా సీటింగ్ ఆరెంజ్మెంట్స్ తో లైటింగ్ సదుపాయాలు కల్పించారు. కొత్త క్యాంటీన్లు చూసి నగరవాసులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక లాక్ డౌన్ సమయంలో అన్న‌పూర్ణ క్యాంటీన్లు ఫ్రీ భోజనం అందజేసి వేలాదిమంది ఆకలి తీర్చడం జరిగింది. వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు, విద్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు మూసివేయ‌డంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇబ్బంది ప‌డుతున్న వ‌ల‌స కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్ర‌యులు, వ‌స‌తి గృహాల‌లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల‌కు భోజనం అందజేసింది. ప్ర‌ధాన‌ ఆసుప‌త్రులు, బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్న ప్రాంతాల‌లో అన్న‌పూర్ణ కేంద్రాలు న‌డుస్తున్నాయి. ప్ర‌తి భోజ‌నంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల ప‌ప్పు, సాంబార్‌, ప‌చ్చ‌డి త‌ప్ప‌నిస‌రిగా ఉండే విధంగా మెనూను అమ‌లు చేస్తున్నారు.